జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని ఆయన తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ ప్రకటించారు. 150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారన్నారు.