మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ నేడు ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్‌తో పాటు అధికారులు, మంత్రుల బృందం సచివాలయానికి బయల్దేరారు. ఈ పర్యటనలో బిల్ గేట్స్‌తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల టీమ్ కూడా సెక్రటేరియట్ కు రానుంది. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో వారు సమావేశమయ్యారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఏస్)ను బిల్ గేట్స్ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా అమలవుతున్న విధానాలు, అందుతోన్న రిజల్ట్స్ ను సీఎం చంద్రబాబు గేట్స్‌కు వివరించనున్నారు. అనంతరం సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు బిల్ గేట్స్ టీమ్ తో సమావేశమై గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరుపుతారు.