సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు..!

Spread the love

మరికొద్ది రోజుల్లో అతిపెద్ద పండగైన  సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో  సొంతూళ్లకు వెళ్లేందుకు అందరూ తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక తాజాగా  ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క, రెగ్యులర్ బస్సులు నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు  నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో  నివసించే వారి సౌకర్యార్థం బీ.హెచ్‌.ఈ.ఎల్‌ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను నడపనుంది. 

బీహెచ్‌ఈఎల్‌ డిపో (ఆర్సీపురం) నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి.  ఈ బస్సులు ఆర్సీపురం నుంచి బయలుదేరి మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా వెళ‌తాయి. ఇవి ప్రధానంగా విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తదితర ప్రాంతాలకు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రద్దీని బట్టి అదనపు బస్సులను పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.