కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం బాగా నడిచిందని ఇప్పుడు ఈ పథకాన్ని భ్రష్టు పట్టించారని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. వైయస్ఆర్ ప్రజానాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ప్రజలకు ఏం కావాలో అడిగి అన్ని పథకాలు ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు ఇలా ఎన్నో పథకాలు వైయస్ఆర్ ప్రవేశపెట్టినవే. అలాగే వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006 ఫిబ్రవరి 2న MGNAREGA పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని శ్రీమతి సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతపురం ఒకప్పుడు కరువు జిల్లా. అందుకే దేశంలో తొలిసారి ఇక్కడే ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. బీజేపీ వచ్చాక ఉపాధి హామీ పథకం ఊపిరి తీస్తోందని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 100 రోజులు పక్కాగా పని ఉండేది. ఇప్పుడు 50 రోజులు కూడా పని ఇవ్వడం గగనమైందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో కోటి మంది శ్రామికులు లబ్ధి పొందితే, బీజేపీ ప్రభుత్వం గత ఏడాది 20 లక్షల ఉపాధి హామీ కార్డులను తొలగించిందని ఆక్షేపించారు. ఇప్పుడు బీజేపీ VB–GRAM G చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో 40 శాతం నిధులు రాష్ట్రం పెట్టుకోవాలని గతంలో ఈ పథకానికి 100 శాతం వేతనాలు కేంద్రం ఇచ్చేదని ఇప్పుడు రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తే నిధులు వస్తాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రం 40 శాతం ఇవ్వకుంటే పని ఉండదా? రాష్ట్రాలు చేతులు ఎత్తేస్తే కేంద్రం కూడా నిధులు ఇవ్వదా? అని షర్మిల ప్రశ్నించారు.