ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాకు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తున్నదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రమాదానికిగల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేయడమైనది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

మంత్రి నారా లోకేష్:

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసింది. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *