మరోసారి ఇంధన కొరత అంశంపై ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత షర్మిల విమర్శలు గుప్పించారు. డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల కొద్ది క్యూలో పడిగాపులు. ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం , పెద్ద కాంట్రాక్టర్ల కోసం మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వారి ప్రయోజనాలే ముఖ్యంగా పని చేయడం వారికోసమే ప్రత్యేకంగా డీజిల్ సరఫరా కోరడం ఏంటి ఇదేనా ఈ ప్రభుత్వ ధోరణి? రైతు కన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా? అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది పాలన కాదని పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యమని మండిపడ్డారు. ముందుగా రైతులకు, సాధారణ ప్రజలకు నిరంతర ఫ్యూయల్ సప్లై జరగాలని అన్నారు. సామాన్యుల తరవాత కాంట్రాక్టర్లకు ప్రత్యేక సదుపాయాల గురించి మాట్లాడాలన్నారు. ప్రజలు ఎలా పోతే ఏంటి మాకు కాంట్రాక్టర్లే ముఖ్యం అనుకుంటే, ప్రజల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.