ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, మన కలల రాజధాని అమరావతి ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది. కేవలం ఇది ఒక నగరం కాదు, ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశల ప్రతిరూపం. మొట్ట మొదటి సారిగా నవ్యంధ్ర రాజధాని దీనికి వేదిక కావడం కీలక పరిణామం. అమరావతి అంటే మరణం లేని నగరం. శాతవాహనుల కాలం నుండి ఆధ్యాత్మికతకు, విజ్ఞానానికి నిలయంగా వెలుగొందిన చరిత్ర ఈ ప్రాంత సొంతం. బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి చాటిన ఈ నేల, నేడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే ప్రజాస్వామ్య వేడుకను జరుపుకోవడం ఒక అద్భుతమైన సన్నివేశంగా చెప్పుకోవచ్చు. ఒకప్పటి చరిత్రకు తిరుగులేని వైభవానికి, భవిష్యత్తు ప్రగతికి అమరావతి ఒక వారధి. ఈ ఏడాది అమరావతిలో ఎగరనున్న మన త్రివర్ణ పతాకం నూతన రాజధాని విశిష్టతను, అభివృద్ధి సంకల్పానికి సాక్షిగా నిలవనుందనడంలో సందేహం లేదు. గణతంత్ర వేడుకలు ఇక్కడ జరగడం అంటే, రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు వేయడమే. ఇక ఈ నెల 26న తొలిసారిగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకుఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం,గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఏటా విజయవాడలో నిర్వహిస్తోంది. ఇకపై వీటిని అమరావతిలోనిర్వహించాలని నిర్ణయించింది. రాయపూడి సమీపంలో ఎమ్మెల్యే భవన సముదాయాల నుంచిహైకోర్టు భవన సముదాయాలకు వెళ్లే మార్గంలో సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం గ్యాలరీలు, వేదిక నిర్మాణం, శకటాల రూపకల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పరేడ్ నిర్వహణకు సన్నద్ధతలో భాగంగా తాజాగా పోలీసులు నమూనా కవాతు చేశారు.