గోవిందరాజస్వామి ఆలయంలో హైడ్రామా: “మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతా” అంటూ గోపురంపై నిందితుడి వీరంగం!

Spread the love

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి చేసిన హల్‌చల్ భక్తులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతి అనే వ్యక్తి, మద్యం మత్తులో ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించడమే కాకుండా, ఏకంగా ఆలయ గోపురం ఎక్కి కూర్చున్నాడు. విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి లోపలికి వెళ్లిన అతను, గోపురంపై ఉన్న కలశాలను పీకేందుకు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అతడిని కిందకు దిగమని కోరగా.. “నాకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతా” అంటూ డిమాండ్ చేయడంతో అక్కడ వింత పరిస్థితి నెలకొంది. దాదాపు మూడు గంటల పాటు ముప్పతిప్పలు పెట్టిన నిందితుడిని, చివరకు ఫైర్ సిబ్బంది నిచ్చెనలు వేసి, తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. పటిష్టమైన భద్రత ఉండే ఆలయంలోకి అతను ఎలా ప్రవేశించాడనే కోణంలో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.