కేంద్ర బడ్జెట్ ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించింది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిందని కేంద్ర బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు. యువశక్తిని ప్రేరేపిస్తూ దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనే దృక్పథం 2026-2027 కేంద్రం బడ్జెట్ లో కనబడిందన్నారు. సంస్కరణలే దేశ ఆర్ధిక ప్రగతికి మూలాలు అన్న సూత్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆమె ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్ దేశాన్ని స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతూ వచ్చాయన్నారు. ప్రపంచం మొత్తం మాంద్యం వైపు అడుగులు వేస్తున్న సమయంలోనూ భారత దేశం తన సత్తా ఏంటో నిరూపించుకుంది.  సంస్కరణలు, సంక్షోభ నివారణ, మౌలిక ప్రగతి, దేశ భద్రత, రైతు సంక్షేమం, వికసిత గ్రామీణ భారతం, ఆర్ధిక స్వావలంబన తదితర అంశాలకు పెద్ద పీట వేసిన 2026-2027 బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆపరేషన్ సిందూర్ ద్వారా మన రక్షణ బలం ఏంటో ప్రత్యర్ధులకు చాటిన ప్రధాని మోడీ  నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రూ. 53.47 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ. 7.84 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించడం ద్వారా దేశ రక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పకనే చెప్పారు. బోర్డర్ సెక్యూరిటీతోపాటు దేశ అంతర్గత భద్రతకూ ప్రాధాన్యత ఇస్తూ ఈ సారి హోంశాఖకు రూ. 2.55 లక్షల కోట్లు కేంద్రం కేటాయించింది. సరిహద్దు భద్రత, అంతర్గత శాంతి భద్రతలు బలంగా ఉన్నప్పుడే దేశం ఆర్ధికంగానూ దూసుకుపోతుందన్న సూత్రాన్ని ఇక్కడ అమలులో చూపారు. రక్షణ రంగం తర్వాత రవాణా రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. హైస్పీడ్ కారిడార్లతో దేశంలోని ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గించడం, రవాణా రంగానికి ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. బడ్జెట్ లోని ముఖ్యంశాలను డిప్యూటీ సీఎం అభినందించారు. ముఖ్యంగా 17 రకాల క్యాన్సర్ ఔషధాలపైన, డయాబెటిక్ లాంటి దీర్ఘకాల వ్యాధులకు వినియోగించే మందులపైనా పన్ను తగ్గింపు కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు.  బడ్జెట్ లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో రెండు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన రేర్ ఎర్త్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం విలువైన ఖనిజాల వెలికితీత, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. తీర ప్రాంత మత్స్యకార సర్క్యూట్ బలోపేతం చేయడం, మహిళలు చేపలు పెంచుకునే అవకాశం, ఎలాంటి సుంకం లేని చేపల పెంపకం వంటి నిర్ణయాలు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని స్పష్టం చేశారు.  ముఖ్యంగా ఉప్పాడ 100 రోజుల ప్రణాళికకు ఈ బడ్జెట్ ఊతం ఇస్తుంది. చేనేత రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్ర చేనేత పరిశ్రమను మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందన్నారు.  కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలు కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జీడి రైతులకు ఊరటనిస్తుంది. ఈ బడ్జెట్ భారత భవిష్యత్ శక్తి ఆవిష్కృత బడ్జెట్. బడ్జెట్ ఫలాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. దేశ ఆర్ధిక వృద్ధికి దోహదం చేస్తున్న ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.