
Former MLA Bolla Brahmanaidu: వినుకొండ మాజీ ఎంఎల్ఏ బొల్లా బ్రహ్మనాయుడి తీరు పార్టీ శ్రేణులకు నచ్చడం లేదా. ఆయన నోటి దురుసు వ్యాఖ్యలతో చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోతున్నారా. కిందస్థాయి నుంచి ఎంఎల్ఏ స్థాయికి చేరిన బ్రహ్మనాయుడు, అనవసర డైలాగులతో జనంలో అభాసుపాలు అవుతూ సొంత పార్టీకే తలనొప్పులు తెస్తున్నారా. తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఇక్కడ పార్టీలు, వర్గాలు ఎప్పుడు యాక్టివుగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు విజయం సాధించారు. రాజకీయంతో పాటుగా సేవా రంగంలోనూ ఆంజనేయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొద్ది రోజులుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, జీవీ ఆంజనేయులు మధ్య మాటలయుద్ధం, సవాళ్ల పర్వం కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందన్న అంశంపై బహిరంగ చర్చకు సిద్దమంటూ జీవీ ఆంజనేయులు సవాల్ చేసారు. అదే సమయంలో మూడుసార్లు గెలిచిన జీవీ ఆంజనేయులు, నియోజవర్గానికి ఏం చేసారో చెప్పాలని బొల్లా బ్రహ్మనాయుడు ప్రతి సవాల్ చేశారు. దీంతో తాను ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్దమని జీవీ ఆంజనేయులు ముందుకు వచ్చారు.
ఇక ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన వారికి పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి జీవీ ఆంజనేయులు పదవులు ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యె మక్కెన మల్లీఖార్జునకు జిల్లా జీడిసిసి బ్యాంకు చైర్మన్ ఇప్పించారు. తన ప్రధాన అనుచరులు ఏడుగురికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇప్పటించటంలో సక్సెస్ అయ్యారు. నియోజకవర్గంలో ఇటీవలే స్త్రీ శక్తి కార్యక్రమంలో గర్భిణీ మాహిళలకు జీవీ ఆంజనేయులు శ్రీమంతం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమాలతో అటు పార్టీ నేతలకు, నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గర అయ్యారు ఆంజనేయులు.
మరోవైపు బొల్లా బ్రహ్మనాయుడిపై నియోజకవర్గంలో సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోందట. ఆయన స్థానంలో మరోనేతకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటూ వైసీపీ కేడర్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేమంటే, బొల్లాకు మాట తీరు కుదరదనీ, అసందర్భ వ్యాఖ్యలతో అనవసర వివాదాలు తెచ్చుకోవటం పరిపాటిగా మారిందని కార్యకర్తలు చెబుతోన్న మాట. మరోవిషయం ఏంటంటే, పార్టీ నిర్వహించిన మద్యం నిరసనల్లో పాల్గొన్న బొల్లా, మహిళలు ఈ ప్రభుత్వ మద్యం తాగుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన మహిళలు నిరసనలకు దిగారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Former MLA Bolla Brahmanaidu.
మరోవైపు మక్కెన వైసీపీలో ఉన్న సమయంలో ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బ్రహ్మనాయుడు. దీంతో మక్కెన గత ఎన్నికల్లో జీవీకి మద్దతుగా పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి దక్కించుకున్నారు. ఇక నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకుంటూ మరింత బలోపేతం అవుతున్నారు జీవీ ఆంజనేయులు. కానీ బొల్లా బ్రహ్మనాయుడి గ్రాఫ్ రోజురోజుకూ తగ్గిపోతోందట. సాంత పార్టీ వారిని సైతం దూరం చేసుకుంటూ సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు వైసీపీ స్థానిక నేతలు చెబుతున్నారట. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం పరిస్తితి చక్కదిద్దకపోతే, వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటామని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారట.