
Ponguleti vs. Konda Surekha: ఒకరేమో వరంగల్ జిల్లాలో తిరుగులేని నేత. మరొకరు ఖమ్మంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత. ఒకరు ఆ జిల్లాకు చెందిన మంత్రి, మరొకరు ఆ జిల్లాకు ఇంచార్జి మంత్రి. సమిష్టిగా పనిచేయాల్సిన వీరిద్దరు, సొంత అవసరాల కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారట. అటు పార్టీకి, ఇటు సీఎంకు తలనొప్పిగా మారారట. అసలు ఈ ఇద్దరు అమాత్యుల మధ్య గొడవకు కారణం ఏంటి. ఇద్దరి మధ్య జరుగుతోన్న కోల్డ్ వార్, ఏ పరిస్తితులకు దారి తీస్తుంది. వాచ్ దిస్ స్టోరీ.
కొండా దంపతులకు వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతికూల పరిస్తితిలను ఎలా ఎదుర్కోవాలో కొండా దంపతులకు తప్ప మరెవరికి సాధ్యం కాదని జిల్లా రాజకీయాల్లో టాక్ ఉంది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక కొండా దంపతుల ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందన్న చర్చ జిల్లాలో జరుగుతోందట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఓ వైపు వైరం కొనసాగుతుండగానే, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూపంలో కొండా దంపతులకు మరో సవాల్ ఎదురైందట. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి పదవి కోసం పొంగులేటితో లాబీయింగ్ చేస్తున్నారని గతంలో కామెంట్ చేసిన కొండా దంపతులు, తమకు రాహుల్ గాంధీ మద్దతు ఉందనీ, మంత్రి పదవికి ఢోకా లేదని మరో స్టేట్మెంట్ ఇచ్చి మరింత అగ్గి రాజేశారని సొంత పార్టీలోనే చర్చ జరిగింది.
జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డితో వర్గపోరు ఎదుర్కొంటున్న సమయంలో పొంగులేటితో కూడా వైరం పెట్టుకోవడం ఏంటని జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రచర్చ జరుగుతోందట. సెప్టెంబర్ 17న నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పొంగులేటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా నేతలతో పాటు వరంగల్ జిల్లా నేతలు కూడా హాజరయ్యారు. కానీ వరంగల్ జిల్లాలో కొండా సురేఖ పాల్గొన్న ప్రోగ్రాంకి జిల్లా నేతలు రాలేదు. ఈ విషయాన్ని కొండా సురేఖ జీర్ణించుకోలేక పోతున్నారట. మరోవైపు మొన్నటి వరకు సమ్మక్క సారక్కలాగా ఉన్న మంత్రి సీతక్కతో కూడా కొండా సురేఖకు కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరు కావడం, అదే సమయంలో కొండా సురేఖ దూరంగా ఉండడంతో వీరిద్దరి మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతం అయిందట.
ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన నాయిని రాజేందర్ రెడ్డి,కేఆర్ నాగరాజు, యశస్వినీ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇదే సమయంలో సురేఖను దూరం పెడుతున్నారట. ఈ పరిస్తితి జిల్లా పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరినట్లు అయిందట. ఇక మేడారం జాతర పనులకు సంభంధించిన కాంట్రాక్టులు తమ వాళ్లకు ఇవ్వాలంటే తమ వాళ్ళకు ఇవ్వాలంటూ ఇద్దరు అమాత్యులు ఎవరికి వారు పావులు కదపడంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే ఇబ్బందులు తప్పవని భావించిన మంత్రి కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. తన శాఖలో పొంగులేటి పెత్తనం ఏంటని ప్రశ్నించిన ఆమె, మేడారం జాతర టెండర్లు తన కంపెనీలకు దక్కేలా పొంగులేటి ఒత్తిడి తెస్తున్నారంటూ చేసిన ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. Ponguleti vs. Konda Surekha.
వివాదం మరింత ముదరుతోందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకు క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను కొండా సురేఖ కొట్టిపారేశారు. అయితే తాను హద్దుల్లో ఉంటున్నాననీ, తనకు ఎవ్వరూ క్లాస్ తీసుకోలేదన్న ఆమె మాటలే పార్టీ వైఖరి ఏంటో చెబుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మంత్రి సీతక్కతో కల్సి పొంగులేటి మేడారం జాతర పనులను సమీక్షించారు. అయితే తాను బిజీగా ఉండటం వల్లే మేడారం వెళ్లలేక పోయానంటూ కొండా సురేఖ కవరింగ్ ఇచ్చినా, తాజా పరిస్తితులు మంత్రుల మధ్య సఖ్యత ఏమేరకు ఉందో అర్థం అవుతోందని జనం చెబుతున్నమాట.