తను మరణించి కూడా ఆరుగురు జీవితాలను నిలబెట్టాడు ఒక యువకుడు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేయడం ద్వారా ఆరుగురి ప్రాణాలు నిలబెట్టడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన పెరుగు అమర్ బాబు ఈ నెల 24న తాడికొండ మండలం నిడుముక్కలలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే గుంటూరులోని ఆస్టర్ రమేశ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ క్రమంలో జీవన్‌దాన్ కో ఆర్డినేటర్లు అమర్ తల్లి కోటేశ్వరికి అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. కుమారుడి మరణం కుదిపేస్తున్నప్పటికీ ఆమె తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. సోమవారం డాక్టర్లు అవయవాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. అమర్ గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. లివర్, ఒక కిడ్నీని గుంటూరు రమేశ్ ఆసుపత్రికి, మరో కిడ్నీని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి, రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందించారు. ఈ అవయవదానం ద్వారా మొత్తం ఆరుగురు కొత్త జీవితాన్ని పొందారు. హాస్పిటల్ వైద్యులు మరియు కౌన్సిలింగ్ బృందం అవయవదానం ద్వారా మరికొందరి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని కుటుంబ సభ్యులకు వివరించగా, ఎలాంటి సందేహం లేకుండా అత్యంత సహృదయంతో అమర్ బాబు అవయవాలను దానం చేయడానికి కుటుంబం ముందుకు రావడం అత్యంత అభినందనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.