ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో చరిత్రాత్మక ఘట్టం.. 100 ఏళ్ల తర్వాత కొండపై దీపం

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 12:35 PMకి👁 12 నిమి చదవండి
షేర్ చేయండి:
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో చరిత్రాత్మక ఘట్టం.. 100 ఏళ్ల తర్వాత కొండపై దీపం
FONT SIZE

భక్తుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతూ తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగింది. ఒకటి కాదు రెండు కాదు 100 సంవత్సరాల తరువాత అక్కడ దీపం వెలగడం పట్ల భక్తులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ కార్యక్రమం ఆటంకాలు లేకుండా జరిగేందుకు కొండపై భద్రతను సీ.ఆర్.పి.ఎఫ్ అధీనంలోకి అప్పగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కొండపై ఉన్న రాతి స్తంభం దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తమిళ నాడు ప్రభుత్వానికి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మదురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం కొండపై ప్రసిద్ధ అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం, అలాగే దర్గా ఉన్నాయి. ఏటా జరిగే కార్తీక దీపం ఉత్సవం సందర్భంగా మహా దీపాన్ని కొండపై ఎక్కడ వెలిగించాలి అన్నదే ఈ దీర్ఘకాలిక వివాదానికి ప్రధాన కారణం. ఎప్పటి నుంచో సంప్రదాయంగా ఉచ్చి పిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపం వద్ద మహా దీపాన్ని వెలిగిస్తున్నారు. కానీ, సికందర్ దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి స్తంభం దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని భక్తులు, హిందూ సంఘాలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఈ వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది.

ఇక తాజాగా ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంచలనం కావడానికి కారణం గత వారం జరిగిన పరిణామాలే. ఈ నెల 20వ తేదీన జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మధ్యంతర ఆదేశాన్ని జారీ చేసింది. నవంబర్ 24 వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒకే ఒకసారి షరతులతో దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతిచ్చింది. అయితే, ఈ ఆదేశం యాజమాన్య హక్కుల విషయంలో ఏ పక్షానికీ శాశ్వత ఉదాహరణ కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నవంబర్ 24 న దీపత్తూన్ వద్ద దీపం వెలిగించలేదు. అక్కడ పోలీసులను మోహరించి, ఎప్పటిలాగే ఉచ్చి పిళ్లైయార్ ఆలయ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించారు. దాంతో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ నిరసనలు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు చర్చలకు ఆహ్వానం కాదని, వాటిని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ.. రాజ్యాంగంలోని 144 అధికరణను ధర్మాసనం గుర్తుచేసింది. ట్రస్టీలు అనుమతించకపోవడం వల్లే దీపం వెలిగించలేకపోయామని మదురై కలెక్టర్ చెప్పిన క్షమాపణను కోర్టు ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో కోర్టు కఠినమైన నిర్ణయాను తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టీలు సహా దాదాపు 15 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీన రాష్ట్ర సీఎస్ స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ ట్రస్టు బోర్డును తక్షణమే సస్పెండ్ చేసింది. ఆలయ నిర్వహణను, కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్ , జస్టిస్ వి. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం , సికందర్ దర్గా రెండింటిని సీఆర్‌పీఎఫ్ భద్రతను అప్పగించింది. దర్గాకు పూర్తి రక్షణ కల్పించాలని స్పష్టంగా ఆదేశించింది. అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దీపత్తూన్ రాతి స్తంభంపై సంప్రదాయ దీపం వెలిగించాలని ఆదేశిస్తూ, దర్గాకు అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరంలో భక్తులు దీపం వెలిగించేందుకు అనుమతిచ్చింది. దీంతో నేడు దీపం వెలిగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, కోర్టు నియమించిన రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ పర్యవేక్షణలో, సీఆర్‌పీఎఫ్ భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు