తిరుప్పరంకుండ్రంలో దీపం వెలుగుతుందా?..సీఎం విజయ్ తగ్గుతారా?

తమిళనాడులో ఇప్పుడు ఒకే ఒక్క అంశం రాజకీయంగా, న్యాయపరంగా, ఆధ్యాత్మికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మదురై సమీపంలోని ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు కొండపై ఉన్న రాతి స్తంభం దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తమిళ నాడు ప్రభుత్వానికి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మదురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం కొండపై ప్రసిద్ధ అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం, అలాగే సికందర్ బాదుషా దర్గా ఉన్నాయి. ఏటా జరిగే కార్తీక దీపం ఉత్సవం సందర్భంగా మహా దీపాన్ని కొండపై ఎక్కడ వెలిగించాలి అన్నదే ఈ దీర్ఘకాలిక వివాదానికి ప్రధాన కారణం. ఎప్పటి నుంచో సంప్రదాయంగా ఉచ్చి పిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపం వద్ద మహా దీపాన్ని వెలిగిస్తున్నారు. కానీ, సికందర్ దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి స్తంభం దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని భక్తులు, హిందూ సంఘాలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ వివాదం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దీనికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలోనే ఈ వివాదానికి బీజం పడింది. ఏకంగా 1862లోనే ఇక్కడ దీపం వెలిగించడానికి మొదటిసారి ప్రయత్నం జరిగినట్లు మద్రాస్ హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఆ తర్వాత కొండ యాజమాన్య హక్కులపై ఆలయానికి, దర్గాకు మధ్య పెద్ద న్యాయపోరాటమే జరిగింది. వందేళ్ల క్రితం, అంటే 1923లో సివిల్ కోర్టు ఒక అత్యంత కీలకమైన డిక్రీని ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం.. దర్గా ఉన్న ప్రాంతం, దర్గాకు వెళ్లే మెట్ల మార్గం, అలాగే నెల్లితోప్ ప్రాంతం మినహా మిగిలిన కొండ అంతా అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయానికే చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసినప్పటికీ, ఆలయం తరఫున దాఖలైన అప్పీల్పై 1931లో లండన్లోని ప్రివీ కౌన్సిల్ జ్యుడీషియల్ కమిటీ 1923 నాటి డిక్రీని పునరుద్ధరించింది. కొండలో ఎక్కువ భాగం ఆలయానికి చెందుతుందని తేల్చి చెబుతూనే, దర్గాకు , దానికి వెళ్లే మెట్ల మార్గానికి రక్షణ కల్పించింది. ఆ తర్వాత 1990వ దశకంలో దీపం వెలిగించే ప్రదేశంపై మళ్లీ న్యాయ వివాదాలు మొదలై, దశాబ్దాలుగా కోర్టుల మెట్లు ఎక్కుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఈ వివాదం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంచలనం కావడానికి కారణం గత వారం జరిగిన పరిణామాలే. ఈ నెల 20వ తేదీన జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మధ్యంతర ఆదేశాన్ని జారీ చేసింది. నవంబర్ 24 వ తేదీన, అంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒకే ఒకసారి షరతులతో దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతిచ్చింది. అయితే, ఈ ఆదేశం యాజమాన్య హక్కుల విషయంలో ఏ పక్షానికీ శాశ్వత ఉదాహరణ కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నవంబర్ 24 న దీపత్తూన్ వద్ద దీపం వెలిగించలేదు. అక్కడ పోలీసులను మోహరించి, ఎప్పటిలాగే ఉచ్చి పిళ్లైయార్ ఆలయ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించారు. దాంతో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ నిరసనలు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. తమిళనాడులో, కనీసం మదురై జిల్లాలో పరిపాలనా గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. చట్టాన్ని గౌరవించాల్సిన అధికారులు తమ రాజకీయ పెద్దల ఆదేశాల మేరకు వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది అని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు చర్చలకు ఆహ్వానం కాదని, వాటిని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ.. రాజ్యాంగంలోని 144 అధికరణను ధర్మాసనం గుర్తుచేసింది. ట్రస్టీలు అనుమతించకపోవడం వల్లే దీపం వెలిగించలేకపోయామని మదురై కలెక్టర్ చెప్పిన క్షమాపణను కోర్టు ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో కోర్టు కఠినమైన నిర్ణయాను తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టీలు సహా దాదాపు 15 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీన రాష్ట్ర సీఎస్ స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ ట్రస్టు బోర్డును తక్షణమే సస్పెండ్ చేసింది. ఆలయ నిర్వహణను, కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్ , జస్టిస్ వి. పార్థిబన్లను రిసీవర్లుగా నియమించింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం , సికందర్ దర్గా రెండింటిని సీఆర్పీఎఫ్ భద్రతను అప్పగించింది. దర్గాకు పూర్తి రక్షణ కల్పించాలని స్పష్టంగా ఆదేశించింది. అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దీపత్తూన్ రాతి స్తంభంపై సంప్రదాయ దీపం వెలిగించాలని ఆదేశిస్తూ, దర్గాకు అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరంలో భక్తులు దీపం వెలిగించేందుకు అనుమతిచ్చింది. ఇక ఈసారి కోర్టు ఆదేశాలను ఎవరూ అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు మదురైకి చేరుకుని, తిరుప్పరంకుండ్రం కొండపై భద్రతా బాధ్యతలను చేపట్టాయి. గతంలో దీపం వెలిగించకుండా అడ్డుపడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ ట్రస్టు బోర్డు ఇప్పటికే సస్పెండ్ అయింది. ప్రస్తుతం ఆలయ నిర్వహణ ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తుల చేతుల్లో ఉంది. ఈ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో గట్టి సీఆర్పీఎఫ్ భద్రత మధ్య దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిణామం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన అతిపెద్ద న్యాయ, రాజకీయ పరీక్షగా మారింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, సీఎం విజయ్ ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే, ఆ సమావేశంలో ఏం చర్చించారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తమిళనాడు ప్రభుత్వం ఈ అంశంలో భారత ప్రధాన న్యాయమూర్తి, అంటే సీజేఐ జోక్యాన్ని కోరే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీజేపీ, హిందూ సంఘాలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మురుగనుక్కు ఆరోగరా అంటూ పోస్ట్ చేయడం విశేషం.
