అదరగొట్టిన ఇస్రో..గగన్‌యాన్ లో కీలక పరీక్ష సక్సెస్!
కామెంట్లు (0)

చంద్రయాన్ , ఆదిత్య ఎల్-1 ప్రయోగాలతో సగర్వంగా అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో .. ఇప్పుడు అంతకంటే మరో అతిపెద్ద ప్రయోగానికి సిద్ధమవుతోంది. ముగ్గురు భారతీయులను స్వదేశీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపి, మళ్లీ వాళ్లను సురక్షితంగా భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో గగన్‌యాన్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా ఈ గగన్‌యాన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన.. వ్యోమగాముల ప్రాణాలను కాపాడే సెపరేషన్ సిస్టమ్ పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు వంద శాతం విజయవంతంగా పూర్తి చేశారు.
వివరంగా చెప్పాలంటే గగన్ యాన్ ప్రయోగంలో కీలకమైన ఆర్బిటాల్ మోడ్యూల్. అంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పూర్తి క్యాబిన్ సెటప్ అన్నమాట. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి క్రూ మోడ్యూల్ , రెండోది సర్వీస్ మోడ్యూల్.
ముందుగా క్రూ మోడ్యూల్ విషయానికి వస్తే ఇందులో వ్యోమగాములు కూర్చుంటారు. వారికి అవసరమైన ఆక్సిజన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇక రెండోది సర్వీస్ మోడ్యూల్.. ఇది క్రూ మోడ్యూల్‌కు కింద అటాచ్ అయి ఉంటుంది. వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నన్ని రోజులు ఆ క్యాబిన్ కు కావాల్సిన పవర్, ప్రొపల్షన్ , ఇతర ఎలక్ట్రికల్ సపోర్ట్ ఇవ్వడం సర్వీస్ మోడల్ పని. రాకెట్ భూమి మీద నుంచి ప్రయోగించే సమయానికి ముందే ఈ రెండు మాడ్యూల్స్‌ను ఒక ప్రత్యేకమైన సెపరేషన్ సిస్టమ్ ద్వారా చాలా స్ట్రాంగ్‌గా లింక్ చేసి ఉంచుతారు.
రాకెట్ అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లిన తర్వాత కూడా, ఆ ప్రయాణం ముగిసే వరకు ఇవి రెండూ ఒకే యూనిట్‌గా కనెక్ట్ అయ్యి పనిచేస్తాయి. ఇక మిషన్ పూర్తయ్యాక వ్యోమగాములు తిరిగి భూమి మీదకు వచ్చేటప్పుడు, అంటే భూ వాతావరణంలోకి రీ-ఎంట్రీ ఇచ్చే సమయానికి క్రూ మోడ్యూల్ నుంచి సర్వీస్ మోడ్యూల్ పూర్తిగా విడిపోవాల్సి ఉంటుంది. అలా విడిపోతేనే, క్రూ మోడ్యూల్ పారాచూట్ల సహాయంతో నెమ్మదిగా సముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఒకవేళ ఆ సర్వీస్ మోడ్యూల్ కనక విడిపోకపోతే, దాని బరువు వల్ల, అలాగే గాలి రాపిడి వల్ల క్రూ మోడ్యూల్ మండిపోయే ప్రమాదం ఉంది. అందుకే పైరోటెక్నిక్ పరికరాలు, అంటే పాయింట్ బ్లాంక్‌లో పేలుడు ద్వారా బోల్టులను విడగొట్టే పరికరాలు, జెటిసనింగ్ వ్యవస్థల ద్వారా ఈ వేరుపడే ప్రక్రియ అత్యంత కచ్చితంగా జరగాలి. ఏ ఒక్క చిన్న వైర్ తెగకపోయినా మిషన్ ఫెయిల్ అవుతుంది.

