అమెరికా-చైనా మధ్య ఏఐ చిప్ వార్..! ఆ దేశాలపై కఠిన ఆంక్షలు

ఒకప్పుడు దేశాల మధ్య ఆధిపత్య పోరు అంటే భూభాగాలు, ఆయుధాలు, చమురు నిల్వల చుట్టూ తిరిగేది. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో అగ్రరాజ్యాల మధ్య అసలైన యుద్ధం చిప్స్ చుట్టూ నడుస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని శాసించే అధునాతన ఏఐ చిప్స్ కోసం అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు మరోసారి తీవ్రమైన చిప్ వార్ మొదలైంది. ఇటీవల దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన అధునాతన ఏఐ చిప్స్ అక్రమ మార్గాల ద్వారా చైనాకు ఎగుమతి అయ్యాయన్న వార్తలు సంచలనం రేపాయి. దీంతో అప్రమత్తమైన అమెరికా.. చైనా కంపెనీలు విదేశీ డేటా సెంటర్ల ద్వారా తమ టెక్నాలజీని పొందకుండా అడ్డుకునేందుకు కొత్త ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ఏకంగా ఐదు కీలక దేశాలకు పంపించే ఏఐ చిప్‌లపై ఎగుమతి లైసెన్సింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. మరోవైపు ఎన్విడియాపై అమెరికా నియంత్రణ సంస్థ దర్యాప్తు జరుపుతోందన్న వార్తలతో ఒక్కరోజే ఆ కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలాయి.
అమెరికా విధించిన కొత్త ఆంక్షలు ఇప్పుడు అంతర్జాతీయ టెక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. చైనాకు నేరుగా అధునాతన ఏఐ చిప్‌లు అమ్మకుండా అమెరికా ఇప్పటికే నిషేధం విధించింది. అయినప్పటికీ, ఇతర దేశాల మీదుగా చైనా ఆ చిప్‌లను పొందుతోందని గుర్తించిన అగ్రరాజ్యం.. ఇప్పుడు ఐదు దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్, బ్రెజిల్ దేశాలకు పంపించే ఏఐ చిప్‌లపై ఎగుమతి లైసెన్సింగ్ నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. ఈ ఆంక్షల ప్రకంపనలు నేరుగా ప్రపంచ ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియాపై పడ్డాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అంటే ఎస్ఈసీ, ఎన్విడియాపై దర్యాప్తు జరుపుతోందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలోనే ఈ తాజా ఆంక్షలు అమల్లోకి రావడం గమనార్హం. ఇప్పటికే నియంత్రణపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎన్విడియాకు ఇది కోలుకోలేని దెబ్బలా మారింది. ఈ వరుస వార్తల ప్రభావంతో నవంబర్ 20న స్టాక్ మార్కెట్లో ఎన్విడియా షేర్లు ఏకంగా 11.5 శాతం పడిపోయాయి.
తాజాగా జెఫరీస్ సంస్థ విడుదల చేసిన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో వెల్లడైన గణాంకాలు అమెరికా నిఘా, వాణిజ్య వర్గాలను సైతం ఉలిక్కిపడేలా చేశాయి. చైనా కంపెనీలు అమెరికా చిప్‌లను నేరుగా కొనుగోలు చేయలేకపోయినా, రెండు ప్రధాన దారుల ద్వారా వాటిని అందుకుంటున్నాయి. ఒకటి అక్రమ రవాణా, రెండోది విదేశీ డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వీసులు. 2024లో అమెరికా నిషేధం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల 40వేల ఎన్విడియా చిప్‌లు అక్రమ మార్గాల్లో చైనాకు రవాణా జరిగి ఉండొచ్చని జెఫరీస్ నివేదిక అంచనా వేసింది.
అంతేకాదు, విదేశాల్లో ఉన్న డేటా సెంటర్ల ద్వారా చైనా సంస్థలు నేరుగా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అద్దెకు తీసుకుంటున్నాయి. సింగపూర్‌కు చెందిన మెగా స్పీడ్ అనే సంస్థ, చైనా టెక్ దిగ్గజం అలీబాబా సహా ఇతర చైనా కస్టమర్లకు సుమారు 86 వేల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను అంటే జీపీయూలను లీజుకు ఇస్తోందని ఆ నివేదిక స్పష్టంగా ప్రస్తావించింది. దీంతో అమెరికా ఇప్పుడు సింగపూర్ సహా ఐదు దేశాలపై లైసెన్సింగ్ కొరడా ఝుళిపించింది. గత కొన్నేళ్లుగా మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఆసియాలో ప్రధాన డేటా సెంటర్ హబ్‌లుగా వేగంగా ఎదుగుతున్నాయి. అయితే, తాజాగా అమెరికా ఈ దేశాలకు పంపే ఏఐ చిప్‌లపై ఎగుమతి లైసెన్సింగ్ నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రతి ఎగుమతికి కఠినమైన అనుమతులు, తనిఖీలు తప్పనిసరి కావడంతో ఆగ్నేయాసియాలో ఏఐ మౌలిక సదుపాయాలపై వస్తున్న భారీ పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తవచ్చని జెఫరీస్ నివేదిక హెచ్చరించింది. డేటా సెంటర్ల విస్తరణ ఆలస్యం కావడం, కంపెనీలపై నియంత్రణ భారం పెరగడం వల్ల మొత్తం ఏఐ రంగంలోనే ఒక రకమైన సంక్షోభ వాతావరణం నెలకొంది.
అమెరికా ఆంక్షలు చైనాను పూర్తిగా కట్టడి చేస్తాయా? లేక చైనాను మరింత పట్టుదలగా మార్చుతాయా? అన్నది ఇప్పుడు టెక్ నిపుణుల మధ్య నడుస్తున్న పెద్ద చర్చ. జెఫరీస్ గ్రీడ్ అండ్ ఫియర్ నివేదిక ఇదే అంశాన్ని కీలకంగా ప్రస్తావించింది. అమెరికా ఆంక్షలు కఠినతరం అయ్యేకొద్దీ, సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగవంతం కావచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా టెక్నాలజీపై ఆధారపడటాన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి చైనా ఇప్పటికే తన దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమను యుద్ధ ప్రాతిపదికన బలోపేతం చేసుకుంటోంది. కేవలం చిప్ తయారీ మాత్రమే కాకుండా.. చిప్ డిజైన్, తయారీ ప్రక్రియ, దానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు, కీలక ముడి పదార్థాల రంగాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని చైనా వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. అంటే అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలు తాత్కాలికంగా చైనా ఏఐ కంపెనీలకు ఇబ్బంది కలిగించినా, దీర్ఘకాలంలో అమెరికాకు పోటీగా సొంత సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించుకునేలా చైనాను ప్రోత్సహిస్తున్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఎన్విడియా వంటి దిగ్గజ కంపెనీలపై ఎస్ఈసీ దర్యాప్తు, షేర్ల పతనం, మరోవైపు ఐదు దేశాలపై ఆంక్షలతో ఆగ్నేయాసియా ఏఐ పెట్టుబడులకు ఎదురవుతున్న అడ్డంకులు, ఇంకోవైపు సొంత సెమీకండక్టర్ వ్యవస్థ కోసం చైనా చేస్తున్న వేగవంతమైన ప్రయత్నాలు.. ఇవన్నీ కలిసి ప్రపంచ టెక్ రంగంలో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి.



