మనుషులు చేయలేనిది ఏఐ చేసిందా?..160 ఏళ్ల నాటి మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ ..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత 160 ఏళ్లకు పైగా ప్రపంచంలోని మహామహా గణిత మేధావులకు సైతం అంతుచిక్కని ఒక అత్యంత క్లిష్టమైన గణిత రహస్యాన్ని ఛేదించిందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఉద్యోగి, గణిత శాస్త్రవేత్త లెవెంట్ అల్పోజ్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థ ఏఐ టూల్ అయిన క్లాడ్ సాయంతో ప్రఖ్యాత రీమాన్ పరికల్పనను తాను నిరూపించానని ఆయన ప్రకటించారు. అది కూడా సాధారణ గణిత పత్రం రూపంలో కాకుండా, ఏకంగా 1.7 కోట్ల లైన్ల కంప్యూటర్ కోడ్ రూపంలో ఆ నిరూపణను విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరిస్తే 9 కోట్లకు పైగా బహుమతి ఇస్తామని 2000 సంవత్సరంలోనే ప్రకటించారు. ఈ రీమాన్ పరికల్పన అంటే గణిత శాస్త్రంలో దీనికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం. ఇది 1859 నాటి అత్యంత ప్రసిద్ధ గణిత సిద్ధాంతం. అంటే దాదాపు 160 ఏళ్లకు పైగా ఇది గణిత శాస్త్రవేత్తలకు ఒక అంతుచిక్కని సవాలుగానే మిగిలిపోయింది. ప్యూర్ మ్యాథ్స్‌లో పరిష్కారం కాని అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఇది అగ్రస్థానంలో ఉంటుంది. సరళంగా చెప్పాలంటే.. ఈ సిద్ధాంతం ప్రధాన సంఖ్యల తీరుతెన్నులను వివరిస్తుంది. 2, 3, 5, 7, 11 వంటి ప్రధాన సంఖ్యలు పెద్దవవుతూ, అనంతం వైపు వెళ్లేకొద్దీ అవి ఏ క్రమంలో విస్తరిస్తాయో ఈ రీమాన్ పరికల్పన చెబుతుంది. వినడానికి చిన్న విషయంలా అనిపించినా, అనంతమైన సంఖ్యల ప్రపంచంలో దీన్ని ఖచ్చితంగా నిరూపించడం అనేది దశాబ్దాలుగా మానవ మేధస్సుకు సవాలుగా నిలిచింది. ఈ సమస్య ప్రాముఖ్యతను గుర్తించిన క్లే మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ 2000 సంవత్సరంలో ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ రీమాన్ పరికల్పనను ఎవరైతే ఖచ్చితంగా పరిష్కరిస్తారో, వారికి ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 9 కోట్లకు పైగా బహుమతి ఇస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది మేధావులు ప్రయత్నించినా, దాన్ని పూర్తిస్థాయిలో నిరూపించలేకపోయారు.



