అప్పుల ఊబిలో పాకిస్థాన్ ఆఖరి పోరాటం..పట్టించుకోని అమెరికా చివరికి ఆదుకున్న సౌదీ

తమ దగ్గర విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో, ఐఎంఎఫ్ ను ,అంతర్జాతీయ పెట్టుబడిదారులను నమ్మించడానికి పాకిస్థాన్ ఆడిన ఒక గేమ్ ఇది. తమ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని క్రియేట్ చేయడానికి.. సౌదీ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ ద్వారా ఏకంగా 3 బిలియన్ డాలర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వాల్ట్స్ లో డిపాజిట్ చేయించుకుంది. అంటే ఆ డబ్బును పాకిస్థాన్ వాడుకోవడానికి వీల్లేదు, కేవలం తమ రిజర్వ్స్ లో ఆ డబ్బు ఉందని లెక్కలు చూపించుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. దీన్నే సేఫ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటారు. ఇది పాకిస్థాన్ కు ఎందుకు అంత ముఖ్యం అంటే.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్థాన్ కు 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించింది. కానీ అందులో నుంచి ఒక్కో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి ఐఎంఎఫ్ చాలా కఠినమైన షరతులు పెట్టింది. పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ లో కనీస విదేశీ మారక నిల్వలు ఎప్పుడూ మైంటైన్ చేయాలి అనేది అందులో అతిపెద్ద షరతు. అక్టోబర్ చివర్లో ఈ 3 బిలియన్ డాలర్ల సౌదీ డిపాజిట్ గడువు తీరిపోయింది. ఆ డబ్బు వెనక్కి వెళ్ళిపోతే ఐఎంఎఫ్ షరతులను పాకిస్థాన్ ఉల్లంఘించినట్లు అవుతుంది, వెంటనే ఐఎంఎఫ్ ఇచ్చే ప్యాకేజీ ఆగిపోతుంది. ఈ భయంతోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హుటాహుటిన రియాద్ వెళ్లి, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో అత్యవసర మంతనాలు జరిపి, ఎలాగోలా ఈ అప్పు గడువును పొడిగించుకున్నారు. తద్వారా పాకిస్థాన్ తాత్కాలికంగా దివాలా ముప్పు నుంచి తప్పించుకుంది.
ఒకప్పుడు పాకిస్థాన్ అనగానే, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఒక సానుభూతి ఉండేది. ఇస్లామిక్ బ్రదర్ హుడ్ పేరు చెప్పి పాకిస్థాన్ దశాబ్దాల పాటు గల్ఫ్ దేశాల నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను ఉచిత నిధులుగా, సబ్సిడీ చమురుగా దండుకుంది. మిడిల్ ఈస్ట్ కు మేమే సైనిక రక్షణ కల్పిస్తాం అంటూ పాక్ ఆర్మీ అక్కడ బిల్డప్ ఇచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది, సౌదీ అరేబియా నాయకత్వం మారింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేతిలోకి సౌదీ పగ్గాలు వచ్చాక విదేశాంగ విధానంలో ఒక భారీ మార్పు వచ్చింది. ఎమోషన్స్, మతం ఆధారంగా ఫండ్స్ ఇవ్వడం సౌదీ పూర్తిగా ఆపేసింది. విజన్ 2030 పేరుతో పక్కా కార్పొరేట్ తరహాలో, బిజినెస్ మోడల్ లోకి సౌదీ అరేబియా మారిపోయింది. నో మోర్ ఫ్రీ మనీ అని సౌదీ అరేబియా పాకిస్థాన్ కు మొహం మీదే తేల్చి చెప్పేసింది. మేము మీకు అప్పు ఇవ్వాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా మాకు గ్యారెంటీగా రిటర్న్స్ రావాలి. మీ దేశంలో ఆస్తులు రాసిస్తేనే మేము డబ్బులు ఇస్తాం అని ఒక కఠినమైన నిబంధన పెట్టింది. దీంతో తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దశాబ్దాలుగా ఉచిత నిధులపై ఆధారపడిన పాకిస్థాన్ ఎస్టాబ్లిష్మెంట్ కు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఉచితంగా ఫండ్స్ ఇవ్వకపోవడంతో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలోని అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను, భూములను తాకట్టు పెట్టడానికి అమ్మేయడానికి సిద్ధమైంది.



