ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు…స్పీకర్ ఎన్నిక అంశంలో నెతన్యాహూకు ఎదురుదెబ్బ

మిడిల్ ఈస్ట్ లో ఒకవైపు హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ లను సవాలు చేస్తూ తడాఖా చూపిస్తున్న ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు అంతర్గత రాజకీయాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సొంత పార్లమెంట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో కీలకంగా భావించే ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ గా నెతన్యాహు అభ్యర్థి ఘోర పరాజయం పాలయ్యారు. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి, ఇజ్రాయెల్ మాజీ సైన్యాధిపతి అయిన గాడి ఐసెన్కాట్ వర్గానికి చెందిన మాటన్ కహానా స్పీకర్ గా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో నెతన్యాహు లాంటి స్ట్రాంగ్ లీడర్ కు సొంత పార్లమెంట్ లో పరాభవం ఎదురుకావడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ లో మొత్తం 120 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఐసెన్కాట్ వర్గానికి చెందిన మాటన్ కహానాకు 66 మంది సభ్యులు మద్దతు పలకగా.. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ అభ్యర్థి ఒఫిర్ కాట్జ్కు కేవలం 52 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇప్పటివరకు స్పీకర్గా కొనసాగిన నెతన్యాహు వర్గానికి చెందిన అమీర్ ఓహానా పదవిని కోల్పోయారు. ఈ మార్పు ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే, పార్లమెంట్లో ఏ అంశాలపై చర్చ జరపాలి? ఏ బిల్లులను ఓటింగ్ కు తీసుకురావాలనే విషయాల్లో స్పీకర్ కు సర్వాధికారాలు ఉంటాయి. ఇప్పుడు స్పీకర్ సీటు ప్రతిపక్షం వైపుకు పోవడంతో నెతన్యాహు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే విపక్ష కూటమికి పార్లమెంట్ లో పైచేయి లభించినట్లయింది. నెతన్యాహు ఇకపై ఏకపక్షంగా తన ఇష్టమొచ్చిన బిల్లులను పాస్ చేసుకునే అవకాశం లేదు.
మాజీ ఆర్మీ చీఫ్ ఐసెన్కాట్ కూటమి ప్రధాన లక్ష్యాలు మొదటగా నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయవ్యవస్థ సంస్కరణలను రద్దు చేయడం. న్యాయవ్యవస్థ స్వతంత్రతను తగ్గించేలా ఈ సంస్కరణలు ఉన్నాయంటూ గతంలో ఇజ్రాయెల్లో భారీ స్థాయిలో లక్షలాది మందితో నిరసనలు జరిగాయి. ఇక రెండోది అత్యంత ప్రమాదకరమైనది.. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ ఎటాక్స్ . ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ ఉన్న ఇజ్రాయెల్.. ఆ దాడులను అడ్డుకోవడంలో ఎందుకు విఫలమైంది? దీని వెనుక ఉన్న భద్రతా వైఫల్యాలపై స్వతంత్ర విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఐసెన్కాట్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి పదవికి కాలపరిమితి విధించే ప్రతిపాదన కూడా ఆయన ఎజెండాలో ఉంది. ఇక ఇప్పుడు స్పీకర్ తమవాడే కాబట్టి, ఈ అంశాలపై పార్లమెంట్లో చర్యలు వెంటనే ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వస్తే, అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో 120 స్థానాలున్న పార్లమెంట్లో నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ఐసెన్కాట్ నేతృత్వంలోని కూటమికి 48 సీట్లు వచ్చాయి. అయితే ఇజ్రాయెల్ లోని అరబ్ పార్టీలకు చెందిన రెండు కూటములు కలిపి 19 స్థానాలు గెలుచుకున్నాయి. ఏ పక్షానికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మ్యాజిక్ ఫిగర్ లభించలేదు. ఇక్కడే అరబ్ పార్టీలు కీలకంగా మారాయి. వారి మద్దతుతోనే స్పీకర్ ఎన్నికలో ఐసెన్కాట్ వర్గం 66 ఓట్లు సాధించింది. దీంతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్కాట్కు అధికారికంగా అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 28 రోజుల గడువు ఉండగా, అవసరమైతే మరో 14 రోజులు పొడిగించవచ్చు. అయితే అరబ్ పార్టీల మద్దతును ప్రభుత్వ ఏర్పాటు వరకు ఐసెన్కాట్ కొనసాగించగలరా లేదా అన్నదే ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇక ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నెతన్యాహు కేవలం ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే కొనసాగుతారు. ఒకవేళ ఐసెన్ కాట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే, వచ్చే ఏడాది ఇజ్రాయెల్ లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఆపద్ధర్మ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రస్తుత పరిణామాలు ఒక పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



