ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం.. భారత్ కూ తప్పని ప్రకృతి విపత్తుల ముప్పు!

గత ముప్పై సంవత్సరాలలో 1996 నుండి 2025 వరకు చూసుకుంటే వాతావరణ మార్పులతో ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉంది. జర్మనీకి చెందిన ఒక పర్యావరణ సంస్థ తన నివేదికలో ప్రకృతి విపత్తుల కారణంగా గత 3 దశాబ్దాలలో 9 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయినట్లు పేర్కొంది. ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2027’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఇక వాతావరణ మార్పుల ప్రభావం గురించి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ మరియు మానవ కార్యకలాపాల కారణంగా భూమిపై సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రీన్హౌస్ వాయువుల విడుదల అధికం కావడం వల్ల ఏర్పడుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావం భారతదేశంపై అత్యంత తీవ్రంగా చూపుతోంది. భౌగోళికంగా భారత్ ఎంతో వైవిధ్యమైన వాతావరణం ఉన్న ప్రదేశం వాతావరణ మార్పుల ఫలితంగా రుతుపవనాల గమనం పూర్తిగా తప్పుతోంది. భారతదేశంలో ఉష్ణోగ్రతలు గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా దేశవ్యాప్తంగా వేడిగాలులు (Heatwaves) సర్వసాధారణమైపోయాయి. ఈ వడగాల్పుల ఉధృతికి ప్రతి ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
భారతీయ వ్యవసాయ రంగం పూర్తిగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల రాక అనిశ్చితంగా మారింది. ఒకే సీజన్లో కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతుంటే, మరికొన్ని ప్రాంతాలలో నీటి కొరత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంటల ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం 7 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ధృవ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని వలన కొన్ని ప్రధాన తీర ప్రాంత నగరాలు మునిగిపోయే ప్రమాదం కూడా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ఉప్పునీరు భూగర్భంలోకి చొచ్చుకుపోవడం వల్ల తాగునీటి వనరులు కలుషితమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఇక మత్స్యకారుల జీవనోపాధి కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లోని హిమానీనదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం నేపాల్ లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ చూశాం. ఇది కూడా గ్లేసియర్స్ కరగడం కారణంగా సంభవించిన ప్రకృతి విపత్తే. ఇక వాతావరణ మార్పుల కారణంగా అటవీ పర్యావరణ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. అనేక జీవజాతులు మారుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక తమ సహజ నివాసాలను కోల్పోతున్నాయి. ఇది బయోడైవర్సిటీ బ్యాలెన్స్ కోల్పోతోంది.
వాతావరణంలో వచ్చే మార్పులు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది వైద్య రంగంపై అదనపు భారాన్ని మోపుతోంది. వ్యవసాయం దెబ్బతిన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మరియు తీర ప్రాంత కోతకు గురవుతున్న ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఈ వలసల వల్ల నగరాలపై జనాభా భారం పెరుగుతోంది. వాతావరణ మార్పుల తీవ్రత కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. తుపాన్లు, వరదలు, కరువుల వలన ప్రతి ఏటా మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వాలు వీటి పునరుద్ధరణ కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే వాతావరణ మార్పులను నివారించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పులు అనేది కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు, యావత్ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది మనుగడకు సంబంధించిన ప్రశ్న. ప్రభుత్వాల విధానపరమైన మార్పులతో పాటు, ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణ పరిస్థితులతో ఉన్న భూమిని అందించగలం. ప్రకృతితో మమేకమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే ఈ విపత్తు నుంచి బయటపడటం సాధ్యమవుతుంది.



