RC17 హీరోయిన్ రేసులో ఆ ఐదుగురు భామలు..లక్కీ ఛాన్స్ కొట్టేది ఎవరు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో RC17 వర్కింగ్ టైటిల్‌తో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం RC17కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం ఏకంగా ఐదుగురు బ్యూటీస్ కు సుకుమార్ లుక్ టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్ శ్రీలీల, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా మారుతున్న సారా అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, సాత్విక వీరవల్లి పేర్లు కూడా ఈ ఆడిషన్స్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఎంతో నిశితంగా పరిశీలిస్తున్న చిత్ర బృందం, వీరిలో ఎవరినీ ఇప్పటివరకు అధికారికంగా ఎంపిక చేయలేదట. కుర్ర భామలందరినీ ఒకటికి రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేసి, ఆ క్యారెక్టర్‌కు ఎవరు వంద శాతం న్యాయం చేస్తారో వారినే ఫైనల్ చేయాలని చూస్తున్నారు.
సుకుమార్ రూటే వేరు. గతంలో రంగస్థలం సినిమాలో గ్లామరస్ స్టార్ సమంతను పక్కా పల్లెటూరి పిల్ల రామలక్ష్మిగా డీగ్లామర్ లుక్‌లో చూపించి మెప్పించారు. అలాగే పుష్ప సినిమాలో రష్మికను శ్రీవల్లిగా అత్యంత సహజంగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు RC17 కోసం కూడా ఆయన తొందరపడకుండా.. తాను రాసుకున్న ఆ బలమైన పాత్రకు సరిపోయే నటిని ఎంపిక చేసేందుకు తగినంత సమయం తీసుకుంటున్నారు. అందుకే పేరున్న స్టార్ హీరోయిన్ల వెనుక పడకుండా, అప్ కమింగ్ టాలెంట్‌ను కూడా ఎంకరేజ్ చేస్తూ పలువురు యువ నటీమణులకు ఆడిషన్స్, లుక్ టెస్టులు నిర్వహిస్తున్నారట. సుకుమార్ ఆడిషన్స్ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఎవరికి వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం మొదలుపెట్టారు. RC17 కోసం ఈ ఐదుగురిలో ఒకరిని హీరోయిన్గా ఖరారు చేస్తారా? లేదా చివరి నిమిషంలో ఎవరూ ఊహించని మరో నటిని ఎంపిక చేసి సుకుమార్ తనదైన స్టైల్లో ట్విస్ట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఒక హీరోయిన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రామ్ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ అయితే ఆన్ స్క్రీన్ పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని, ఆమె అయితేనే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్, ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్గా కూడా మంచి ప్రాజెక్టులు ఎంచుకుంటోంది. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా సుకుమార్ మనసులో కూడా సారా అర్జునే ఉందా? లేక తన లెక్కల ప్రకారం మరో బ్యూటీని ఫైనల్ చేస్తారా అన్నది చూడాలి.



