ఒక్కరోజులో 50 వేల కోట్లు..షేర్ మార్కెట్ లో అంబానీ హవా…అదరగొట్టిన రిలయన్స్
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో తాజాగా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కళ్లుచెదిరేలా ఏకంగా 11.6 శాతం పెరిగాయి. గత 6 ఏళ్లలో రిలయన్స్ షేర్లు ఒకే రోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే అత్యధికం. నిఫ్టీ–50 ఇండెక్స్‌లో ఈ షేరు అత్యధిక లాభాలు ఆర్జించి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. షేర్ల విలువ ఈ స్థాయిలో దూసుకెళ్లడంతో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒకే రోజులో అత్యధికంగా సంపదను పెంచుకున్న బిలియనీర్ గా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. సోమవారం అంబానీ వ్యక్తిగత సంపద 7.85 శాతం వృద్ధితో సుమారు 52వేల 920 కోట్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద విలువ అక్షరాలా రూ.7,45,920 కోట్లకు చేరుకుంది. ఈ అమాంతం వృద్ధితో ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 23వ స్థానంలో నిలిచారు. ఇదే జాబితాలో రూ.6,64,608 కోట్ల సంపదతో మరో భారతీయ దిగ్గజం గౌతమ్ అదానీ 26వ స్థానంలో ఉన్నారు. స్పెయిన్ రిటైల్ వ్యాపారి అమన్సియో ఒర్టెగా, చైనాకు చెందిన జోంగ్ షాన్షాన్ లాంటి కుబేరులు కూడా ఈ వారం భారీ లాభాలు గడించినా అంబానీ దరిదాపుల్లోకి రాలేకపోయారు. ఆసియాలో నెం.1 గా ఉన్న అంబానీ.. బైట్ డ్యాన్స్ అధినేత జాంగ్ యిమింగ్ను కూడా అధిగమించేశారు.
షేర్ మార్కెట్ అంటే ఒక రోజులో కోటీశ్వరులను చేస్తుంది, అలాగే రోడ్డు మీద కూడా పడేస్తుంది అంటారు. కానీ రిలయన్స్ షేర్ ఆకస్మాత్తుగా 11.6 శాతం ఎందుకు పెరిగింది? అంటే వెనుక పక్కా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్కెట్ నిపుణుల అంచనాలను తలకిందులు చేస్తూ, రిలయన్స్ ఏకంగా రూ.25,548 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది అక్షరాలా 40.6 శాతం వృద్ధి. క్వార్టర్ రిజల్ట్స్ ఇంత అద్భుతంగా వచ్చేసరికి, ఇన్వెస్టర్స్ రిలయన్స్ షేర్ల మీద ఎగబడి మరీ పెట్టుబడులు పెట్టారు. ఆ కొనుగోళ్ల సునామీ వల్లే ఒక్కరోజులో అంబానీ సంపద రూ.50 వేల కోట్లు పెరిగింది.
