ట్రంప్ కు ఇరాన్ ఓపెన్ వార్నింగ్…టెహ్రాన్ వీధుల్లో టెన్షన్
ఇరాన్-అమెరికాల మధ్య పరిస్థితులు ఎంత ఉద్రిక్తకరంగా ఉన్నాయో తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తూ మేం ట్రంప్‌ను చంపేస్తాం అని రాసి ఉన్న ఒక భారీ హోర్డింగ్‌ను టెహ్రాన్ వీధుల్లో ఏర్పాటు చేసి ఇరాన్ బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. ఇది కేవలం ఒక పోస్టర్ కాదు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ ఇస్తున్న ఒక భయంకరమైన సైకలాజికల్ వార్నింగ్ అని గ్లోబల్ పొలిటికల్ ఎనలిస్టులు పలువురు అభిప్రాయపడుతున్నారు. టెహ్రాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎంగెలాబ్ స్క్వేర్ లో ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జైలు కటకటాల వెనుక ఖైదీలా తలదించుకుని దీనంగా కూర్చున్నట్లుగా చూపించారు. దానికి కింద పెద్ద అక్షరాలతో మేం ట్రంప్‌ను చంపేస్తాం అని రాసి ఇరాన్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇది ఒక్కటే కాదు, టెహ్రాన్ వీధుల్లో మరొక భయంకరమైన బిల్ బోర్డు కూడా వెలిసింది. ఆ బోర్డుపై ట్రంప్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ , అమెరికా విదేశీ రాయబారి స్టీవ్ విట్కాఫ్, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చిత్రాలను పొందుపరిచారు. ఈ నలుగురి ముఖాలు రక్తసిక్తమై , బట్టలు చిరిగిపోయి, యుద్ధంలో ఓడిపోయినట్లుగా చూపించడమే కాకుండా, వారి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు కాలిపోయి ధ్వంసమైనట్లు చిత్రీకరించారు. ఇది చూసిన ఇరాన్ ప్రజలు అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా వీధుల్లో భారీ నినాదాలు చేస్తున్నారు.
మీకు ఇక్కడో లాజిక్ అర్థం కావాలి. ఇరాన్ లో అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి అంతకుమించి ఎందుకు జరుగుతున్నాయి అంటే.. దానికి కారణం ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం . అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఆయన మరణానికి అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలే కారణమని ఇరాన్ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రభుత్వ మద్దతుతోనే ఈ ప్రదర్శనలు జరుపుతూ, అమెరికాపై పగ తీర్చుకోవాలనే డిమాండ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.అయితే బయటకు ఇంత గంభీరంగా కనబడుతున్న ఇరాన్, లోపల మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గజగజ వణుకుతోంది. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే.. ప్రపంచం దృష్టి ఎన్నికలపై ఉన్న గ్యాప్ లో, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మరోసారి తీవ్రమైన సైనిక దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. ముఖ్యంగా ఈసారి దాడులు జరిగితే ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్ అవుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా ఇరాన్ తన అణు కేంద్రాల వద్ద యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ తో భద్రతను భారీగా పెంచింది. అంటే లోపల భయపడుతూనే, బయటకు మాత్రం ట్రంప్ ను చంపుతాం అంటూ సైకలాజికల్ గేమ్ ఆడుతోంది. ఒక దేశం శక్తివంతమైనప్పుడు అది ఆయుధాలతో సమాధానం చెబుతుంది. కానీ ఇరాన్ పరిస్థితి ఇప్పుడు పోస్టర్లు, హోర్డింగ్స్, డూప్ నటుల ప్రదర్శనల వరకే పరిమితమైంది. అమెరికాను నేరుగా ఢీకొట్టే సత్తా లేక ఇలాంటి సైకలాజికల్, ప్రోపగాండా వార్ తో ఇరాన్ తన ప్రజలను మభ్యపెడుతోందని గ్లోబల్ ఎక్స్ పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్, అమెరికా గనక ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తే.. మిడిల్ ఈస్ట్ మ్యాప్ పూర్తిగా మారిపోవడం ఖాయం.



