శ్రద్ధా వాకర్ ను ముక్కలుగా నరికిన సైకో అఫ్తాబ్… ఎలాంటి నరకం అనుభవిస్తున్నాడో తెలుసా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, సైకో కిల్లర్ అఫ్తాబ్ పూనావాలా ఇప్పుడు తన ప్రాణాలను కాపాడాలంటూ ఢిల్లీ కోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తీహార్ జైలులో ఉన్న అఫ్తాబ్.. తోటి ఖైదీల నుంచి తనకు ప్రాణహాని ఉందని , తన ముఖంపై పదునైన ఆయుధాలతో దాడి చేసి కోసేస్తామని వాళ్లు బెదిరిస్తున్నారని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. ఏకంగా ఆ ఐదుగురు ఖైదీల పేర్లను కూడా కోర్టుకు సమర్పించాడు.
భారతదేశంలోనే అత్యంత భద్రత కలిగిన తీహార్ జైలు. ఎంతోమంది కరుడుగట్టిన నేరస్థులు ఉండే ఈ జైలులో ఇప్పుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా జీవితం నరకప్రాయంగా మారింది. శ్రద్ధా వాకర్ కేసు విచారణలో భాగంగా ఇటీవల అఫ్తాబ్ ను ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా అఫ్తాబ్ తన లాయర్ ద్వారా ఒక సంచలన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాడు. గత 10 రోజులుగా కొందరు తోటి ఖైదీలు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని, అవకాశం దొరికితే ముఖాన్ని పదునైన ఆయుధాలతో కోస్తామని అంటున్నారని కోర్టుకు తెలిపాడు. ప్రస్తుతం తాను తీహార్ జైలులో 4A నంబర్ వార్డులో ఉన్నానని, అక్కడ ప్రత్యేక సెల్‌తో పాటు శిక్షా వార్డు కూడా ఉందని అఫ్తాబ్ వివరించాడు. భద్రత ఉన్నప్పటికీ తన ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లవచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తనను టార్గెట్ చేసిన ఆ ఐదుగురు ఖైదీలు ఎవరో వారి పేర్లను కూడా లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించాడు. అఫ్తాబ్ ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును, అతని వాదనల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. అతడి భద్రత కోసం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జైలు అధికారుల్ని ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపి త్వరలో ఒక సమగ్ర నివేదిక సమర్పించాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.



