జాక్‌పాట్ కొట్టేసిన మమితా బైజు!..కన్నడ హీరోకు జోడీగా మలయాళ కుట్టీ

చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టి పాన్ ఇండియా సెన్సేషన్‌గా నిలిచిన చిత్రం హను-మాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి భాగం సక్సెస్ తోనే ఆగిపోకుండా.. వెంటనే దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో సాక్షాత్తూ హనుమంతుడి పాత్రలో కాంతార ఫేమ్, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ కూడా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.
హను-మాన్ సృష్టించిన ప్రభంజనం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జై హనుమాన్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం మమితా బైజును రంగంలోకి దించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా తెలుగులోనూ ఎంత పెద్ద డబ్బింగ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో రీను గా తనదైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్ తో తెలుగు యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయింది మమితా బైజు. రీసెంట్ గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహోం కుటుంబ యూనిట్ చిత్రాలతో వరుస విజయాలందుకుని మంచి జోరుమీద ఉంది మమితా . ఈ తరుణంలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కథలో ఒక కీలకమైన మహిళా పాత్ర కోసం మమితా బైజును సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదొక పౌరాణిక, సోషియో-ఫాంటసీ కథ కాబట్టి, ఆమె పాత్ర చాలా కొత్తగా, ఎమోషనల్ గా డిజైన్ చేశారట. కథ విన్న వెంటనే మమితా కూడా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఆమె క్రేజ్ నేషనల్ వైడ్ గా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం కాస్టింగ్ ను గమనిస్తే.. ప్రశాంత్ వర్మ కేవలం ఒక రీజినల్ సినిమా తీయట్లేదని, అన్ని భాషల మార్కెట్లను కవర్ చేసేలా పక్కా పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నారని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. డైరెక్టర్, టెక్నీషియన్స్ టాలీవుడ్.. హీరో రిషబ్ శెట్టి శాండల్ వుడ్ . హీరోయిన్ మమితా బైజు మాలీవుడ్ . ఈ కాంబినేషన్ చూస్తుంటేనే సౌత్ మార్కెట్ మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చే ప్రణాళిక స్పష్టంగా అర్థమవుతోంది. నార్త్ ఇండియాలో ఇప్పటికే రామభక్తి, హనుమాన్ కనెక్ట్ తో భారీ మార్కెట్ ఓపెన్ అయి ఉంది. దీనికి తోడు ఈ సీక్వెల్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో, ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత హాలీవుడ్ సాంకేతిక విలువలతో నిర్మిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ఈసారి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రామిస్ చేశారు. మమితా బైజు, రిషబ్ శెట్టి కాంబినేషన్ కు తోడు, ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా హేమాహేమీలను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్ పై అంచనాలు డబుల్ అవుతాయి. అలాంటిది హను-మాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న యూనివర్స్ మూవీ కావడంతో జై హనుమాన్ పై అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి. హీరో రిషబ్ శెట్టి, ఈ ప్రాజెక్ట్ కోసం తన మేకోవర్ ను సైతం మారుస్తున్నారు. ఇక కుర్రకారు కలల రాకుమారిగా మారిన మమితా బైజు రాకతో ఈ ప్రాజెక్ట్ కు అదనపు గ్లామర్, క్రేజ్ యాడ్ అయ్యాయి. త్వరలోనే ఆమె కాస్టింగ్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మరోసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.



