భారత ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు..!

భారత్ విభిన్నమైన సంస్కృతులు, భాషలు, ప్రాంతాలూ ఉన్నా అన్నింటిని తనలో కలుపుకుని ఐక్యంగా ముందుకు సాగుతున్న దేశం. ఈ వైవిధ్యత, ఐక్యతపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రశంసలు కురిపించారు. ఒక ఇంటర్వ్యూలో పుతిన్.. భారతదేశ ప్రాచీన సంస్కృతి, చరిత్ర, భాషా వైవిధ్యంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయ నాగరికతను అత్యంత ప్రాచీనమైనవని వీటి గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటుంటే, అంత ఎక్కువగా తనకు ఆసక్తిని కలిగిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను కూడా పుతిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారతదేశంలో ప్రధానంగా ఒక భాష మాట్లాడేవారు ఎంతమంది, ఇతర భాషలు మాట్లాడేవారు ఎంతమంది అని మోదీని అడిగి తెలుసుకున్నప్పుడు తాను ఎంతగా ఆశ్చర్యపోయారో పుతిన్ వివరించారు. మీ దేశ పౌరుల్లో ఎంతమంది అధికారిక భాష మాట్లాడతారు అని ఆయన్ను అడిగాను. దానికి ఆయన సుమారు 60 కోట్ల మంది అని చెప్పారు. ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశంలో మిగిలిన మూడింట రెండొంతుల మంది తమ సొంత ప్రాంతీయ భాషలను మాట్లాడతారు. అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే భారత్ పై ఇట్స్ స్టన్నింగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. కేవలం భాషా వైవిధ్యం మాత్రమే కాకుండా భారతదేశపు ఘనమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం పట్ల కూడా వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని గొప్ప నాగరికతల గురించి ప్రస్తావిస్తూ, భారతీయ నాగరికతను ఆయన ప్రధాన ఉదాహరణగా చూపారు. ప్రాచీనమైన భారతీయ నాగరికత ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించి నేను ఎంత ఎక్కువగా తెలుసుకుంటుంటే, అంత ఎక్కువగా దానికి ఆకర్షితుడినవుతున్నాను అని పుతిన్ వ్యాఖ్యానించారు. వేల ఏళ్ల ప్రాచీన నాగరికత, సాంస్కృతిక వైభవం, అద్భుతమైన భాషా వైవిధ్యంతో అగ్రదేశాల అధినేతలను సైతం భారత్ ఈస్థాయిలో ఆకట్టుకుంటోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ గురించి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.




