ట్రంప్‌నకు నెతన్యాహు సీక్రెట్ కాల్స్…ప్రెసిడెంట్ డెసిషన్ అదేనా..?

మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఎటుదారితీస్తాయో అనే ఆందోళనలు ఇప్పటికీ తగ్గలేదు. అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగియగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దౌత్యపరమైన లాబీయింగ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, నెతన్యాహు ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్ చేసి, ఇరాన్‌పై తక్షణమే మిలటరీ దాడులు ప్రారంభించాలని కోరుతున్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి, వారి అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఇదే సరైన సమయమని నెతన్యాహు వాదిస్తున్నారు. నిజానికి గత జులైలో ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదరడంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తాత్కాలికంగా ఆగిపోయాయి. కానీ ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దాడులకు దిగాలని నెతన్యాహు పట్టుబడుతున్నారని అయితే, వైట్ హౌస్‌లో ఉన్న కొందరు అధికారులు ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. ఈ యుద్ధం మళ్లీ మొదలైతే అమెరికా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని వారు ట్రంప్‌కు సలహా ఇస్తున్నారు. వైట్ హౌస్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, నెతన్యాహు చేస్తున్న ఈ రోజువారీ ఒత్తిడి ట్రంప్ అధికార యంత్రాంగానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది.
నెతన్యాహు ఒకవైపు ఇలా యుద్ధం కావాలని గట్టిగా పట్టుబడుతుంటే.. మిడిల్ ఈస్ట్‌లోని కీలక దేశాలు మాత్రం ట్రంప్‌ను మరోవైపు లాగుతున్నాయి. యుద్ధం మళ్లీ వస్తే తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా నాశనం అవుతాయని భయపడుతున్న గల్ఫ్ నేతలు.. దౌత్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికాను కోరుతున్నారు. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితిని యథాతథంగా ఉంచాలని, ఇరాన్‌పై ఎలాంటి కొత్త మిలటరీ ఆపరేషన్స్ చేపట్టవద్దని వారు ట్రంప్‌కు స్పష్టం చేశారు. యుద్ధం మళ్లీ మొదలైతే ఇరాన్ కచ్చితంగా ప్రతీకార దాడులకు దిగుతుందని, అది కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం కాకుండా మొత్తం మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరిస్తుందని అరబ్ నేతలు భయపడుతున్నారు. సముద్ర మార్గాల్లో చమురు రవాణాపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతుందని వారు సర్దిచెప్పినట్లు సమాచారం. రెండు వైపుల నుంచి వస్తున్న ఈ తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖతార్ ప్రధానితో సమావేశమైన తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో ఒక కీలకమైన పోస్ట్ పెట్టారు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ లాంటి దేశాలు ఇప్పుడున్న ప్రశాంత వాతావరణమే కొనసాగాలని కోరుకుంటున్నాయి. ఇరాన్‌తో నెలకొన్న తొమ్మిది నెలల ఈ యుద్ధాన్ని ముగించే దిశగా అడుగులు పడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు చేసే అవకాశం దాదాపు లేదని ట్రంప్ ఒక పరోక్ష సంకేతం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నెతన్యాహు లాబీయింగ్ కంటే, గల్ఫ్ దేశాల వాదనకే ట్రంప్ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. అమెరికాకు ఆర్థిక ప్రయోజనాలే ఎప్పుడూ ముఖ్యం కాబట్టి, అరబ్ దేశాలను కాదని, ఆయిల్ ట్రేడ్‌ను రిస్క్‌లో పెట్టి మరీ ఇజ్రాయెల్ కోసం ట్రంప్ యుద్ధానికి దిగకపోవచ్చని డిప్లొమాటిక్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన టార్గెట్ అయిన ఇరాన్ కూడా ఏమాత్రం సైలెంట్‌గా లేదు. తమపై గనక మళ్లీ దాడులు జరిగితే, ఆ యుద్ధాన్ని కేవలం మిడిల్ ఈస్ట్‌కే పరిమితం చేయబోమని, అది ప్రపంచంపై కూడా పడుతుందనేట్లు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ స్తంభించిన ఆస్తులను విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ పెట్టిన 7 షరతులకు వాషింగ్టన్ అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా ఇరాన్ మీడియా ఏజెన్సీలు ఒక విషయాన్ని కుండబద్దలు కొట్టాయి. సముద్ర మార్గానికి కీలకమైన హార్ముజ్ జలసంధి వ్యవహారంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. దీంతో అమెరికా ఇప్పుడు ఒక ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితిలో పడింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం బలమైన ప్రభుత్వం లేదు, నెతన్యాహు ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశీయంగా తన పట్టును నిలుపుకోవడానికే ఆయన ఇరాన్‌పై ఈ యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారని ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ట్రంప్ ప్రస్తుతం దౌత్యం వైపు మొగ్గు చూపుతున్నా.. నెతన్యాహు ఎత్తుగడలు భవిష్యత్తులో అమెరికా విధానాన్ని మారుస్తాయా అన్నది వేచి చూడాలి.



