ఖరీఫ్ నాటికి ఆ ప్రాజెక్టులు రెడీ కావాలి..అధికారులకు సీఎం డెడ్‌లైన్!

వర్షాలు లేని ప్రాంతాలకు, ఎగువన ఉన్న భూములకు నీరు అందించాలంటే ఎత్తిపోతల పథకాలే రైతులకు ప్రాణాధారం. నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలకు మళ్లీ జీవం పోయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఒక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మూలనపడ్డ ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, వాటి ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. క్యాంప్ కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై ఒక అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. అధికారులకు డెడ్‌లైన్స్ విధించారు. ప్రస్తుతం ఏపీలో 789 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ అత్యవసరంగా ఉందని జలవనరుల శాఖ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ 789 పథకాల మరమ్మతుల కోసం 632 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ నిధులు ఖర్చు చేసి వీటిని అందుబాటులోకి తెస్తే, అదనంగా 7 లక్షల 49 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటి సదుపాయం కల్పించవచ్చని అధికారులు వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు.. ఈ 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులన్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఖరీఫ్ సీజన్‌కు పూర్తి కావాలని స్పష్టం చేశారు. జూన్ నాటికి నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి వాటి స్థితిగతులను పరిశీలించాలని, ఆలస్యం చేయకుండా వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వచ్చే జూన్ నాటికి ఈ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ 789 ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం జలహారతి కార్పొరేషన్లోనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీర్‌ను , లేదంటే కనీసం ఒక సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పర్యవేక్షణను వారి చేతుల్లో పెట్టాలని సూచించారు. ఇలా ఒక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేయడం వల్ల, పంప్‌హౌస్‌లలో ఏ చిన్న మోటార్ రిపేర్ వచ్చినా వెంటనే బాగు అవుతుందని, రైతులకు నిరంతరాయంగా నీరు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఎత్తిపోస్తే, ఆ కరెంట్ బిల్లులు కట్టలేక ప్రాజెక్టులు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనికి చంద్రబాబు ఒక అద్భుతమైన, ఆదాయం తెచ్చిపెట్టే పరిష్కారాన్ని ఆలోచించారు. జలవనరుల శాఖ పరిధిలో ప్రస్తుతం 5,565 ఎకరాల భూమి ఖాళీగా అందుబాటులో ఉంది. అందులో 4,061 ఎకరాలను కేవలం సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అధికారులు గుర్తించారు. దీని ద్వారా 877 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో మరో 110 ఎకరాలను గుర్తించారు, దాని ద్వారా 25.8 మెగావాట్లు ఉత్పత్తి చేయవచ్చు. మొత్తంగా చూసుకుంటే, ఇరిగేషన్ శాఖకు ఉన్న 4,171 ఎకరాల భూమిని సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించడం ద్వారా ఏకంగా 903 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. ఈ విద్యుత్‌తో ఎత్తిపోతల పథకాలకు నిరంతర కరెంట్ సరఫరా చేయడమే కాకుండా.. మిగిలిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా ఇరిగేషన్ శాఖకు అదనపు ఆదాయం కూడా వస్తుంది. కేవలం ఖాళీ భూముల్లోనే కాకుండా, గుజరాత్ తరహాలో కాలువలపై కూడా ఈ ప్యానెల్స్ వేసి సోలార్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. మనకు కరెంట్ బిల్లుల రేట్లు పెంచాలన్నా, పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వాలన్నా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనే ఒక స్వతంత్ర సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు సాగునీటి రంగానికి కూడా అలాంటి వ్యవస్థనే తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఒక సరికొత్త ఆలోచన చేశారు. జలవనరుల రంగంలోనూ వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై లోతైన అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, విద్యుత్ రంగాల్లో ఉన్న విధంగానే సాగునీటి రంగంలోనూ ఒక పక్కా నియంత్రణ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.



