తాలిబన్లకు ఆయుధాలు బలూచిస్థాన్ తరహాలో మరో రాష్ట్రం…పాక్ చేస్తున్నదేంటి?

పాకిస్థాన్ లో ప్రధాని అనేది కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే, అసలైన అధికారం మొత్తం ఆర్మీ చీఫ్ చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఒక అత్యంత ప్రమాదకరమైన హార్డ్-స్టేట్ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. అంటే దేశంలో ఏ మూల సమస్యనైనా సరే, చర్చలతో కాకుండా కేవలం సైనిక బలప్రయోగంతో, తుపాకీతోనే అణచివేయాలి అనేది ఆయన ఫిలాసఫీ. ఆ సిద్ధాంతమే ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ కు ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ పై పడింది.
అక్టోబర్ 11న ఇస్లామాబాద్ లోని ఫెడరల్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలైన ఆర్టికల్ 232, 234 ను ఉపయోగించి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో గవర్నర్ పాలన విధించింది. అక్కడ ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదిని ఎలాంటి ఆధారాలు లేకుండానే మిలిటరీ కస్టడీలోకి తీసుకుంది. కేవలం గంటల వ్యవధిలో అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రం మొత్తాన్ని పాక్ ఆర్మీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తీవ్రవాదుల దాడులు పెరిగాయని పాక్ ఆర్మీ చెబుతున్న కారణాలు కేవలం ఒక సాకు మాత్రమే. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పాక్ ఆర్మీ అనామకంగా కూల్చేసింది. దీని వెనుక భద్రతా కారణాలు లేవని, ఇది ముమ్మాటికీ ఆర్థిక దోపిడీ అని గ్రీక్ సిటీ టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు కుండబద్దలు కొడుతున్నాయి. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా అంటే ఒకప్పుడు కేవలం ఉగ్రవాదులకు అడ్డా మాత్రమే కాదు, భూగర్భంలో అపారమైన, అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్న ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఇన్నాళ్లూ ఆ ఖనిజాలు రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్ లో ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్నే బైపాస్ చేసి ఆ సంపద మొత్తాన్ని మిలిటరీ తన చేతుల్లోకి తీసుకుంది.



