తాలిబన్లకు ఆయుధాలు బలూచిస్థాన్ తరహాలో మరో రాష్ట్రం…పాక్ చేస్తున్నదేంటి?

పాకిస్థాన్ లో ప్రధాని అనేది కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే, అసలైన అధికారం మొత్తం ఆర్మీ చీఫ్ చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఒక అత్యంత ప్రమాదకరమైన హార్డ్-స్టేట్ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. అంటే దేశంలో ఏ మూల సమస్యనైనా సరే, చర్చలతో కాకుండా కేవలం సైనిక బలప్రయోగంతో, తుపాకీతోనే అణచివేయాలి అనేది ఆయన ఫిలాసఫీ. ఆ సిద్ధాంతమే ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ కు ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ పై పడింది.
అక్టోబర్ 11న ఇస్లామాబాద్ లోని ఫెడరల్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని అత్యవసర అధికారాలైన ఆర్టికల్ 232, 234 ను ఉపయోగించి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో గవర్నర్ పాలన విధించింది. అక్కడ ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదిని ఎలాంటి ఆధారాలు లేకుండానే మిలిటరీ కస్టడీలోకి తీసుకుంది. కేవలం గంటల వ్యవధిలో అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రం మొత్తాన్ని పాక్ ఆర్మీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తీవ్రవాదుల దాడులు పెరిగాయని పాక్ ఆర్మీ చెబుతున్న కారణాలు కేవలం ఒక సాకు మాత్రమే. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పాక్ ఆర్మీ అనామకంగా కూల్చేసింది. దీని వెనుక భద్రతా కారణాలు లేవని, ఇది ముమ్మాటికీ ఆర్థిక దోపిడీ అని గ్రీక్ సిటీ టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు కుండబద్దలు కొడుతున్నాయి. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా అంటే ఒకప్పుడు కేవలం ఉగ్రవాదులకు అడ్డా మాత్రమే కాదు, భూగర్భంలో అపారమైన, అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్న ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఇన్నాళ్లూ ఆ ఖనిజాలు రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్ లో ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్నే బైపాస్ చేసి ఆ సంపద మొత్తాన్ని మిలిటరీ తన చేతుల్లోకి తీసుకుంది.
పాకిస్థాన్ రాజ్యాంగంలో గతంలో చేసిన 18వ సవరణ ప్రకారం.. ఏ ప్రావిన్స్ లో ఉన్న ఖనిజాలు, సహజ వనరులు అయినా సరే అవి పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంటాయి. వాటిపై కేంద్ర ప్రభుత్వానికి గానీ, మిలిటరీకి గానీ ఎలాంటి ప్రత్యక్ష నియంత్రణ ఉండదు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం విషయానికొస్తే, అది ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీకి అతిపెద్ద కంచుకోట. అక్కడ పీటీఐ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చేజిక్కించుకుని, వాటిని చైనా లాంటి విదేశీ కొనుగోలుదారులకు అప్పగించి వేల కోట్లు వెనకేసుకోవాలని పాక్ ఆర్మీ ఎప్పటినుంచో స్కెచ్ వేసింది. కానీ 18వ సవరణ వారికి అడ్డొచ్చింది. అందుకే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి, అసెంబ్లీని రద్దు చేసి ఎమర్జెన్సీ విధించారు. దీనివల్ల ఇప్పుడు ఆ రాష్ట్రం నేరుగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే పరోక్షంగా ఆ రాష్ట్ర ఖనిజాలపై పాక్ ఆర్మీకి పూర్తి నియంత్రణ లభించినట్లయింది. రాజ్యాంగాన్ని వక్రమార్గంలో వాడుకుని సైన్యం చేసిన అతిపెద్ద మైండ్ గేమ్ ఇది అని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
సొంత ప్రజలను మోసం చేసి ఖనిజాలను కొల్లగొట్టడం పాకిస్థాన్ ఆర్మీకి కొత్తేమీ కాదు. బలూచిస్థాన్ లో వారు దశాబ్దాలుగా చేస్తున్నది అదే. కానీ బలూచిస్థాన్ వేరు, ఖైబర్ పఖ్తుంఖ్వా వేరు. ఈ ఖైబర్ ప్రాంతం దాదాపు 4 కోట్ల జనాభాతో, బలమైన రాజకీయ చైతన్యంతో ఉంది. వీటన్నింటికీ మించి.. ఈ ప్రాంతానికి ఆఫ్ఘనిస్థాన్ తో డ్యూరాండ్ లైన్ సరిహద్దు ఉంది. ఇక్కడ ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీకి, టీటీపీ ఉగ్రవాదులకు మధ్య భీకరమైన సాయుధ తిరుగుబాటు నడుస్తోంది. కరెక్ట్ గా చెప్పాలంటే, పాక్ ఆర్మీ ఇప్పుడు తాలిబన్ల అడ్డాలోకి వెళ్లి మరీ చేతులు కాల్చుకోబోతోంది. ఈ ఎమర్జెన్సీ నిర్ణయం పాకిస్థాన్ ఉనికినే ప్రమాదంలో పడేయబోతోంది.
ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేయడం, ప్రావిన్స్ వనరులను కేంద్రం బలవంతంగా లాక్కోవడం తీవ్రవాద గ్రూపులకు ఒక కొత్త ఆయుధాన్ని అందించినట్లే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని దోచుకుంటోంది, ఇస్లామాబాద్ సైన్యం మన వనరులను లాక్కుంటోంది అని చెబుతూ తీవ్రవాదులు సులభంగా అక్కడి పౌరులను తమవైపు తిప్పుకుంటారు. అంటే పరోక్షంగా పాక్ ఆర్మీ తీసుకున్న నిర్ణయమే తాలిబన్లకు భారీగా మద్దతు పెరిగేలా చేస్తోంది. ఇది ఖైబర్ పఖ్తుంఖ్వాను కూడా బలూచిస్థాన్ లాగా నిరంతర రక్తపాతం జరిగే పాలనారహిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహం, డబ్బు యావ ఒక సైన్యాన్ని ఎంతకైనా తెగించేలా చేస్తాయి అనడానికి పాకిస్థాన్ ఆర్మీ చర్యలే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజలను రక్షించాల్సిన సైన్యమే, పాలకులను అరెస్ట్ చేసి రాష్ట్రాలను దోచుకుంటే ఇక ఆ దేశాన్ని ఎవరూ కాపాడలేరు. భవిష్యత్తులో ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా పాకిస్థాన్ పాలిట ఒక అతిపెద్ద అగ్నిపర్వతంలా పేలడం ఖాయంగా కనిపిస్తోంది.



