వివాదంలో ఆదర్శ కుటుంబం..మేకర్స్‌కు లీగల్ వార్నింగ్! అసలేం జరిగింది ..?

సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకటేశ్ హీరోగా చేసిన సినిమా ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు మంచి హైప్ ఏర్పడింది. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా అనుకోని విధంగా వివాదంలో చిక్కుకుంది. ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ కు సంబంధించిన ఒక కీలక సన్నివేశంలో, పర్ణశాల సినిమాలోని ఒక వైరల్ పాటను వాడేశారట. దీనిపై పర్ణశాల నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాదు అనుమతి లేకుండా తమ పాటను ఎందుకు వాడారని, చిన్న సినిమాలను బతకనివ్వరా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన తమ సినిమా పాటను అనుమతి లేకుండా మరో చిత్రంలో ఉపయోగించడం వల్ల పర్ణశాల సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని దీనిపై లీగల్ యాక్షన్ కు వెళ్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ , హారర్ కామెడీ అంశాలతో, వై.జి.భరత్ దర్శకత్వంలో మంచి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం పర్ణశాల . ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జిమ్ జిమ్ తార అనే పాటను అద్భుతంగా కంపోజ్ చేసి, సింగర్ లక్ష్మీదేవితో పాడించి చిత్ర బృందం వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఈ పాటకు యూట్యూబ్ లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఊహించని విధంగా, తాజాగా విడుదలైన ఆదర్శ కుటుంబంలో హీరో వెంకటేష్ కి సంబంధించిన ఓ ఎలివేషన్ సన్నివేశంలో తమ జిమ్ జిమ్ తార పాటని అనుమతి లేకుండా వాడేశారని నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న సినిమా బతకాలంటే దాని ప్రమోషన్స్, కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్లాలి. మేం ఎంతో కష్టపడి ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా ఆడియో రైట్స్ అమ్మి విడుదల చేసిన మా సినిమా పాటని, ఎలాంటి అనుమతి లేకుండా మరో పెద్ద చిత్రంలో ఉపయోగించడం వల్ల మా పర్ణశాల సినిమాకు చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీలో చిన్న సినిమాల మనుగడకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఒక పెద్ద హీరో మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం లేదని, కానీ తమ కష్టాన్ని గుర్తించాలని ఆయన కోరుతున్నారు. సంగీత దర్శకుడు ట్యూన్ ఇచ్చి, మేం డబ్బులు ఖర్చుపెట్టి రికార్డ్ చేసిన పాటను ఎవరైనా కాపీ కొడితే ఊరుకునేది లేదు. వెంకటేష్ సినిమాలో కనుక మా పాటను అలాగే ఉంచితే, ఇకపై మా పాటను పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంచి వెంకట్ కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక సాంగ్ రైట్స్ ఒక మ్యూజిక్ లేబుల్ దగ్గర ఉన్నప్పుడు, దాన్ని మరో సినిమాలో వాడాలంటే కచ్చితంగా ఆడియో కంపెనీకి, నిర్మాతకు రాయల్టీ చెల్లించి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆదర్శ కుటుంబం మూవీ మేకర్స్ ఈ విషయంలో ఏం చేస్తారు? ఆ పాటను తీసేస్తారా? లేదా పర్ణశాల నిర్మాతతో కాంప్రమైజ్ అవుతారా? అనేది వేచి చూడాలి.



