నల్లమలలో వేటగాళ్ల బరితెగింపుకు..రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్..?
నల్లమలలో అసలేం జరుగుతోంది..? అటవీ శాఖ నిఘా ఏం చేస్తోంది..? డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లనివ్వకుండా అడ్డుపుడుతుందేవరు..?

నల్లమల.. పేరుకు తగ్గట్టే ప్రకృతి అందాలకు, అరుదైన వన్యప్రాణులకు కేరాఫ్ అడ్రస్. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ఈ అటవీ ప్రాంతం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు సహా ఎన్నో జీవజాతులకు నిలయం. ఇలాంటి అడవిలో వన్యప్రాణుల సంరక్షణకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అక్రమ వేట ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉచ్చులు.. విద్యుత్ తీగలు.. వీటి బారిన పడి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అడవిని కాపాడేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నిఘా కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. మరి ఇన్ని ఏర్పాట్లు ఉన్నా.. వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి..? నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోంది..? ఎక్కడ లోపాలున్నాయి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
అటవీ శాఖ చెబుతున్న నిఘా ఏర్పాట్లకు.. క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న ఘటనలకు మధ్య అసలు అంతరం ఎంత..? యాంటీ పోచింగ్ క్యాంపులు ఉన్నాయంటున్నారు.. సిబ్బంది పహారా కాస్తున్నారని చెబుతున్నారు.. డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, వైర్లెస్ పరికరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. కానీ అక్రమ వేట ఆరోపణలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిఘా ఉందంటే సరిపోదు.. అది పనిచేస్తుందా లేదా అన్నదే ముఖ్యం. అడవి సరిహద్దుల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలుగుతున్నారా..? వేటగాళ్లు ఏర్పాటు చేసే ఉచ్చులను సకాలంలో తొలగిస్తున్నారా..? వన్యప్రాణుల మరణాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఇవన్నీ ఇప్పుడు కీలక ప్రశ్నలుగా మారాయి. అయితే నిఘా వైఫల్యం లేదా అధికారుల నిర్లక్ష్యం ఉందని తేల్చాలంటే అధికారిక విచారణ అవసరం.
ఇదిలా ఉంటే.. దుస్మాన్పేట తండా సమీపంలో వెలుగుచూసిన ఘటన ఈ వ్యవహారాన్ని మరింత చర్చలోకి తెచ్చింది. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న విద్యుత్ తీగలకు తగిలి గేదెలు మృతి చెందినట్లు సమాచారం. అదే ప్రాంతానికి సమీపంలో జింకల కళేబరాలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. వాటి కొమ్ములు, మాంసం తొలగించిన ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొంటున్నారు.దీంతో అడవి సమీపంలో అక్రమ వేట సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? గేదెలు, జింకలు ఏ కారణంతో మృతి చెందాయి..? విద్యుత్ తీగలను ఎవరు ఏర్పాటు చేశారు..? అన్నది విచారణలోనే తేలాలి. కానీ ఇక్కడ మరో ప్రమాదం పొంచి ఉంది. వన్యప్రాణులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసే అక్రమ విద్యుత్ తీగలు పశువులతో పాటు మనుషుల ప్రాణాలకూ ముప్పుగా మారవచ్చు. అంటే అక్రమ వేట అనేది అడవికి మాత్రమే కాదు.. సమీప గ్రామాల భద్రతకూ సవాలుగా మారుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో అటవీ శాఖ పనితీరుపై స్థానికుల ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వేటగాళ్లను గుర్తించేందుకు నిఘా ఉందా..? అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయా..? ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారు..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరోవైపు అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, వేటగాళ్లకు కొందరు సహకరిస్తున్నారనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారిక నిర్ధారణ లేదు. అందువల్ల విచారణ ద్వారా వాస్తవాలు బయటపడాల్సి ఉంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. అడవిలో వన్యప్రాణులను కాపాడటం ఒక బాధ్యత అయితే.. వాటిని వేటగాళ్ల బారి నుంచి రక్షించడం మరో పెద్ద సవాల్. ఈ రెండింటిలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


