పాకిస్థాన్ లో బలూచ్ యువరాజు కిడ్నాప్..వణికిపోతున్న ఇస్లామాబాద్..!

పాకిస్తాన్లో ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరత కొనసాగుతున్న వేళ.. అల్లకల్లోలంగా మారిన బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యంపై సాయుధ పోరాటం చేస్తున్న బలూచ్ ప్రజలకు అత్యంత ఆరాధ్యదైవంగా, గౌరవప్రదమైన రాజకుటుంబంగా పేరున్న కలాత్ సంస్థానానికి చెందిన యువరాజు కిడ్నాప్ కావడం ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత భద్రతను కుదిపేస్తోంది. కలాత్ సంస్థాన ప్రస్తుత రాజు అయిన మీర్ సులేమాన్ దావూద్ ఖాన్ కుమారుడు, బలూచ్ యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ ఊహించని విధంగా కిడ్నాప్‌కు గురయ్యారు. ముగ్గురు గన్ మెన్లతో సహా యువరాజును కిడ్నాప్ చేయడం ఇప్పుడు ఇస్లామాబాద్‌తో పాటు అంతర్జాతీయ మీడియాలో కూడా తీవ్ర కలకలం రేపింది.
అక్టోబర్ 26వ తేదీన రాత్రి వేళ యువరాజు మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ ఖుజ్దార్ తన స్వస్థలమైన కలాత్ నగరానికి హైవేపై ప్రయాణిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ సూరాబ్ , కలాత్ ప్రాంతాల మధ్య ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి చేరుకోగానే, భారీగా ఆయుధాలు ధరించిన దుండగులు అకస్మాత్తుగా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. యువరాజుతో పాటు అతని ముగ్గురు బాడీగార్డులను కూడా బందీలుగా పట్టుకుని అక్కడి నుంచి గుర్తుతెలియని ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం అప్రమత్తమైంది. కిడ్నాపర్ల ఆచూకీ కోసం బలూచిస్తాన్ వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కిడ్నాప్‌నకు తామే బాధ్యులమని ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చారిత్రాత్మకంగా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఏలిన రాజులను ఖాన్ ఆఫ్ కలాత్ అని పిలుస్తారు. 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు, కలాత్ సంస్థానం పాకిస్తాన్లో కలవడానికి అంగీకరించలేదు. కానీ 1948లో పాక్ సైన్యం బలవంతంగా కలాత్‌ను ఆక్రమించుకుంది. అప్పటినుంచి బలూచ్ ప్రజలలో పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ ప్రజల దృష్టిలో కలాత్ రాజులకు నేటికీ ఎంతో గౌరవం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుత ఖాన్ ఆఫ్ కలాత్ అయిన మీర్ సులేమాన్ దావూద్ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, గత కొన్నేళ్లుగా లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. పాకిస్తాన్ సైన్యం బలూచ్ ప్రజలపై చేస్తున్న అకృత్యాలను ఆయన అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉన్నారు. స్వతంత్ర బలూచిస్తాన్ పోరాటానికి ఆయన పరోక్ష మద్దతు ఇస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అలాంటి తండ్రికి ఒక బలమైన రాజకీయ వారసుడిగా ఉన్న ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ కిడ్నాప్ కావడం ఇప్పుడు బలూచ్ సమాజంలో పెద్ద షాక్.



