హౌతీలకు దిమ్మతిరిగే షాక్..మళ్లీ మొదలైన ప్రాక్సీ వార్

మిడిల్ ఈస్ట్ మంటలు ఇంకా చల్లారేలా కనిపించడం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య భీకర పోరు సాగుతుండగానే.. మరోవైపు యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న సౌదీ-యెమెన్ సరిహద్దుల్లో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని రెండు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు అత్యంత ప్రమాదకరమైన బాలిస్టిక్ క్షిపణులను , డ్రోన్లను ప్రయోగించారు. ఈ అనూహ్య దాడితో అప్రమత్తమైన సౌదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గాల్లోనే అడ్డుకుని విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని సౌదీ బలగాలే అధికారికంగా ప్రకటించాయి. మంగళవారం జరిగిన ఈ దాడి సౌదీ అరేబియాను ఉలిక్కిపడేలా చేసింది. సౌదీ మిలిటరీ తమ అత్యున్నత రాడార్ వ్యవస్థల ద్వారా ఈ క్షిపణులను, డ్రోన్లను గుర్తించి, అవి లక్ష్యాలను చేరుకోకముందే గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి పేల్చేశాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ముప్పు తొలగిపోయిందని పౌర రక్షణ విభాగం అధికారికంగా ప్రకటించడంతో స్థానిక ప్రజలు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఈ బాలిస్టిక్ క్షిపణులు గనుక లక్ష్యాన్ని ఛేదించి ఉంటే సౌదీకి భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగుండేది. అసలు ఇప్పుడు హౌతీలు సడెన్ గా సౌదీపై ఎందుకు దాడులు తీవ్రం చేశారన్నది ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్. దీనికి ప్రధాన కారణం ఎర్ర సముద్రం పై ఆధిపత్య పోరు. గత నెలలో యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలను హౌతీలు బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ అల్ మందెబ్ జలసంధి వైపు తమ దళాలతో ప్రయాణించారు. ఈ కదలికలను గమనించిన సౌదీ అరేబియా.. హౌతీల వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు వారి స్థావరాలపై వైమానిక దాడులను విపరీతంగా పెంచింది. ఈ దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు హౌతీలు సౌదీపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు.



