ఒకేసారి రూ.6 వేలు జంప్..రికార్డు సృష్టిస్తున్న పసుపు ధర

ఒకప్పుడు పసుపు పండించిన రైతులు సరైన గిట్టుబాటు ధర లేక, దళారుల చేతిలో మోసపోయి రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు మనం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పసుపు నిజంగానే పసిడి పంటగా మారి రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. తాజాగా మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపునకు కళ్లు చెదిరే స్థాయిలో రికార్డు ధర నమోదైంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే క్వింటా పసుపు ధర ఏకంగా 6,000 పైగా జంప్ అవ్వడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నామ్ విధానంలో పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో.. కాడి , గోళ రకం పసుపు మంచి ధర పలికింది.
మహబుబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పసుపు క్రయవిక్రయాలకు పెట్టింది పేరు. ఇటీవలే ఈ మార్కెట్కు రైతులు భారీగా పసుపును తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా రెండు రకాల పసుపు వచ్చింది. ఒకటి కాడి రకం , మరొకటి గోళ రకం . కాడి రకం పసుపును ఏడుగురు రైతులు 69 బస్తాల్లో తీసుకురాగా.. గోళ రకం పసుపును ముగ్గురు రైతులు 30 బస్తాల్లో మార్కెట్ కు తీసుకువచ్చారు. మార్కెట్ అధికారులు ఈ-నామ్ విధానంలో ఆన్లైన్ ఈ-వేలం నిర్వహించారు. ఈ వేలంలో వ్యాపారులు పోటీ పడి మరీ పసుపును కొనుగోలు చేశారు. ధరల వివరాలు చూస్తే రైతులకు పండగే అని చెప్పాలి. కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా 19 వేల 253 ధర పలకగా, కనిష్ఠంగా 15 వేల 589 రూపాయలు పలికింది. ఇక ఈ రకం సగటు ధర చూసుకుంటే 19 వేల 252 పలకడం విశేషం. అంటే దాదాపు తెచ్చిన పసుపు మొత్తానికి అత్యధిక ధరే లభించింది. ఇక గోళరకం పసుపు విషయానికి వస్తే, గరిష్ఠంగా 18వేల 566 రూపాయలు పలకగా, కనిష్ఠంగా 8,506 రూపాయలు, సగటున 17వేల 469 రూపాయల తో వ్యాపారులు సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో కేసముద్రం మార్కెట్ చరిత్రలో ఈ స్థాయి ధర నమోదు కావడం ఒక రికార్డు అని మార్కెట్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



