పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..ఎకరాకు రూ. 70 వేలు అకౌంట్లో

వాతావరణంలో ఈ సంవత్సరం వచ్చిన అనూహ్య మార్పులు రైతులను ఇబ్బందులు పెట్టాయి. కొన్ని ప్రాంతాలు తుపానులతో వరదల్లో మునిగిపోతే..మరికొన్ని ప్రాంతాలు ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎల్ నినో కారణంగా పొలాల్లో గడ్డి లేక, బయట మార్కెట్లో కొందామంటే విపరీతమైన ధరలతో రైతులు అల్లాడిపోతున్నారు. రైతులకు పశువుల పెంపకం భారంగా మారింది. ఈ కష్టకాలంలో పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన పథకంతో ముందుకు వచ్చింది.మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది డెయిరీ సెక్టార్. పశుగ్రాసం కొరత ఏర్పడటంతో, రైతులు పక్క రాష్ట్రాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి భారీ ధరలు వెచ్చించి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం.. వీబీజీ రామ్జీ పథకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు పశుగ్రాసాన్ని బయట కొనే బదులు, తమ పొలాల్లోనే స్వయంగా సాగు చేసుకుంటే వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు, పశుపోషణ వ్యయం భారీగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఈ పథకం కింద నేరుగా రైతులకే ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో పశుగ్రాసం పెంచాలంటే ఒక రైతుకు గరిష్టంగా కేవలం 50 సెంట్ల విస్తీర్ణానికి మాత్రమే అనుమతి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులను, పశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ పరిమితిని పెంచింది. రైతుల దగ్గర ఉన్న పశువుల సంఖ్య ఆధారంగా ఇప్పుడు ఏకంగా ఒక ఎకరా వరకు పశుగ్రాసం సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఒక ఎకరాలో పశుగ్రాసం సాగు చేసిన రైతుకు ప్రభుత్వం అక్షరాలా రూ. 69,781 రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తుంది. ఈ డబ్బును ఒకేసారి కాకుండా రెండేళ్ల కాలంలో రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి సంవత్సరం సాగు ఖర్చుల కింద రూ.43,500 ఇస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదికి రూ.26,281 అందిస్తారు. అంటే రైతులు తమ పశువులకు కావాల్సిన మేతను పండించుకుంటూనే, ప్రభుత్వం నుంచి ఇంత భారీ సాయాన్ని అదనంగా పొందవచ్చన్నమాట. కరువు కాలంలో పాడి రైతులకు ఇంతకంటే మంచి బంపర్ ఆఫర్ మరొకటి ఉండదు. ప్రభుత్వం ఇస్తున్న ఈసాయం పొందాలంటే రైతులకు కొన్ని అర్హతలు ఉండాలి. ఈ వీబీజీ రామ్జీ పథకం ముఖ్యంగా ఉపాధి కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ , చిన్న , సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆర్థికంగా వెనుకబడిన పాడి రైతులను పైకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఆసక్తి గల రైతులు తమ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఉపాధి హామీ కార్డు తదితర ధ్రువపత్రాలను తీసుకుని వెంటనే తమ పంచాయతీ లేదా మండల స్థాయిలోని వీబీజీ రాంజీ పథకం సిబ్బందికి అందజేయాలి. ఎల్నినో నేపథ్యంలో పశుగ్రాసం కొరతను జయించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి రైతూ వినియోగించుకోవాలి.



