యాసంగి రైతు భరోసా..రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయంటే..?

వ్యవసాయ పెట్టుబడి కోసం ఒకప్పుడు రైతుబంధు పేరుతో, ఇప్పుడు రైతు భరోసా పేరుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. వానాకాలం సీజన్ కు సంబంధించి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు ఎలాగోలా జమ చేశారు. అయితే యాసంగి పనులు మొదలైనా..ఇప్పటివరకు రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 24వ విడత కింద 2 వేలు రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ ఎప్పుడు డబ్బులు వేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఎకరాకు 12 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీజన్ కు 6 వేల చొప్పున వానాకాలం, యాసంగికి కలిపి ఈ సాయం అందుతుంది. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తున్నా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం సైలెంట్ గా ఉండటంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సచివాలయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. నవంబర్ లో కాకుండా డిసెంబర్, లేదా జనవరి మాసాల్లో ఈ యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 9,000 కోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దానికి తోడు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. రైతు భరోసా కింద ఎకరాకు ఏకంగా 15 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆ రేంజ్ లో నిధులు తీసుకురావడం అసాధ్యమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు తేల్చి చెబుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ..ఈసారి యాసంగికి అసలు రైతు భరోసా వచ్చే అవకాశమే లేదని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఒక బలమైన కారణం కూడా చూపుతున్నారు. ఈసారి రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం గట్టిగా ఉంది. వర్షాలు తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల యాసంగి సీజన్ లో పంటల సాగు భారీగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నాయి. సరిగ్గా ఈ పాయింట్ నే ప్రభుత్వం ఒక సాకుగా చూపిస్తుందని అనుమానాలున్నాయి. పంటలే సాగు చేయనప్పుడు పెట్టుబడి సాయం ఎందుకు? అనే వాదనను తెరపైకి తెచ్చి, రైతు భరోసా ఇవ్వకుండా స్కిప్ చేస్తారేమో అని రైతులు భయపడుతున్నారు. గత సంవత్సరం యాసంగి సీజన్ లో కూడా ప్రభుత్వం కేవలం కొంత మంది రైతులకే ..తక్కువ ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా విడుదల చేసి చేతులు దులుపుకుందనే ఆరోపణలు, విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఈసారైనా ఎలాంటి కోతలు లేకుండా ప్రతి రైతుకూ పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.
రైతు భరోసా ఫండ్స్ కు సంబంధించి ఇంకొక పెద్ద డిబేట్ రాష్ట్రంలో ఎప్పటినుంచో నడుస్తోంది. అదే భూకమతాల పరిమితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందల ఎకరాలు ఉన్న బడా బాబులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొండలకు, గుట్టలకు కూడా రైతుబంధు పడిందన్నది కాంగ్రెస్ వాదన. అందుకే ఈసారి రైతు భరోసాకు ఒక కచ్చితమైన లిమిట్ విధించాలని స్వయంగా రైతు సంఘాలే డిమాండ్ చేస్తున్నాయి.ఎన్ని ఎకరాలు ఉన్నా సరే.. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా నిబంధనలు మార్చాలని, అప్పుడే నిజమైన పేద, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ ఖజానాపై కూడా వేల కోట్ల భారం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ 5 ఎకరాల నిబంధనను పక్కాగా అమలు చేస్తే, ఆదా అయ్యే నిధులతో ఎకరాకు 15 వేల హామీని నిలబెట్టుకోవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.



