పీఓకేలో పాక్ ఆర్మీ అరాచకం..రావల్కోట్ లో రణరంగం.. పాక్ ఆర్మీకి తిరుగుబాటు సెగ!

దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ ఆర్మీ అకృత్యాలలో నలిగిపోతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. పీఓకే ప్రజలు తమ కనీస హక్కుల కోసం, తమ వనరుల కోసం మిలిటరీకి ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఈ పరిణామాలను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్థాన్ ఆర్మీ, నిరాయుధులైన పౌరులపై అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తోంది. సొంత ప్రజలనే దారుణమైన ఆగడాలకు పాల్పడుతోంది. ప్రస్తుతం పీఓకేలోని రావల్కోట్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఉమర్ ఫరూఖ్ చౌక్ సమీపంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై పాకిస్థాన్ భద్రతా దళాలు ఏకంగా డ్రోన్ దాడులకు , విచక్షణారహిత తుపాకీ కాల్పులకు తెగబడ్డాయి. ఈ కిరాతక దాడిలో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే కనికరం కూడా లేకుండా పాక్ సైన్యం చేస్తున్న ఈ మారణహోమం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో అతిపెద్ద కలకలం రేపుతోంది. శత్రు దేశంపై యుద్ధం చేసినట్లుగా, పాకిస్తానీ సైనికులు గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే పీఓకే పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. నిద్రపోతున్న వారిని కూడా వదలకుండా, ఏమాత్రం కనికరం లేకుండా... వార్నింగ్ ఇవ్వకుండా పాక్ భద్రతా బలగాలు డ్రోన్లతో బాంబులు విసిరాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన కొన్ని విజువల్స్ స్థానికులు ప్రాణాలకు తెగించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో, పాక్ ఆర్మీ అకృత్యాలు ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలయ్యాయి. తాము ఉగ్రవాదులం కాదని తమ హక్కులు అడుగుతున్న సామాన్య పౌరులం అని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎలాంటి ఆయుధాలు లేని ప్రజలపై, అత్యంత అధునాతన డ్రోన్లతో దాడులు చేయడం పాక్ ఆర్మీ క్రూరత్వానికి, వారి పిరికితనానికి అద్దం పడుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
పీవోకేలో పౌరులపై ఇలా సైనిక దాడులు జరగడం ఇదేం మొదటిసారి కాదు. దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు తమ కనీస అవసరాల కోసం అడిగినా మానవ హక్కుల గురించి మాట్లాడినా వారికి దక్కుతోంది ఇదే. గత జూన్ నుంచి పీఓకేలో భారీ ఎత్తున పౌర నిరసనలు ప్రారంభమయ్యాయి. దీన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం జరిపిన ఆపరేషన్స్ లో ఇప్పటివరకు 153 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అక్రమంగా మిలిటరీ జైళ్లలో మగ్గుతున్నారు, ఎంతోమంది యువకులు రాత్రికి రాత్రే అదృశ్యమవుతున్నారు. రావల్కోట్, ముజఫరాబాద్ లాంటి ప్రాంతాల్లో నిరసనల తీవ్రత పెరగడంతో, ఈ దారుణాలు ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి పాక్ ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ముందస్తు చర్యగా అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఒక కంప్లీట్ డిజిటల్ బ్లాక్ అవుట్ ప్రకటించింది. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. అయినప్పటికీ, పీఓకే ప్రజలు భయాందోళనలను పక్కనపెట్టి, ప్రాణాలకు తెగించి పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ ఎంత అణగదొక్కితే అంతగా అక్కడ తిరుగుబాటు బలపడుతోంది. ఇది పాక్ ఆర్మీకి నిద్రలేకుండా చేస్తోంది. ఎన్ని దాడులు చేసినా ఇక వెనక్కి తగ్గేది లేదని పీఓకే ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చాలా స్పష్టమైన డిమాండ్లను ముందుంచుతోంది. తమ వనరులను దోచుకుంటూ తమనే బానిసల్లా చూస్తున్నారని పీఓకే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. స్థానిక శాసనసభలో తమకు సరైన ప్రాతినిధ్యం కావాలని, తమ ప్రాంతీయ వనరులపై తమకే పూర్తి హక్కులు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 1971లో బంగ్లాదేశ్ చేసిన తిరుగుబాటు ఏదైతే ఉందో ఇప్పుడు పీఓకేలో కూడా అటువంటి పోరాటమే కనిపిస్తోంది. పాలస్తీనాలో, కాశ్మీర్ లో మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయంటూ ఐక్యరాజ్యసమితిలో గొంతు చించుకుని అరిచే పాకిస్థాన్, తన సొంత ఆధీనంలో ఉన్న ప్రాంతంలో మాత్రం ఇంత దారుణమైన అణచివేతకు, నరమేధానికి పాల్పడుతోంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మౌనంగా ఉండటం పాక్ ఆర్మీకి మరింత బలాన్ని ఇస్తోంది.



