ప్రపంచ మార్కెట్లకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్

ప్రపంచంలో ఏ మూల చిన్న యుద్ధం జరిగినా, దాని ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపై పడుతుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న పరిస్థితులు చూస్తుంటే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందా అన్న భయం కలుగుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటే, మరోవైపు ఇజ్రాయెల్ దేశీయ రాజకీయాలు ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రేరేపిత దాడి జరిగితే ప్రపంచ మార్కెట్లు నాశనం అవుతాయని తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన హెచ్చరిక ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో వణుకు పుట్టిస్తోంది. దీనికి తోడు, ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును శాశ్వతంగా తొలగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి పనిచేస్తానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోస్తోంది.
ప్రపంచ చమురు , సహజ వాయువు రవాణాలో అత్యంత కీలకమైన ప్రాంతం పర్షియన్ గల్ఫ్ . ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లే చమురు నౌకలు ఇక్కడి నుంచే వెళ్లాలి. సరిగ్గా ఈ పాయింట్‌నే ఇరాన్ ఇప్పుడు తన బ్రహ్మాస్త్రంగా వాడుకుంటోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రేరేపించే ఏ చిన్న సైనిక చర్య అయినా సరే, అది అంతర్జాతీయ మార్కెట్లపై అత్యంత తీవ్రమైన, వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఒకవేళ ఇజ్రాయెల్ గనుక అమెరికా అండతో ఇరాన్ చమురు క్షేత్రాలపై లేదా అణు కేంద్రాలపై దాడులు చేస్తే, దానికి ప్రతీకారంగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్ ను బ్లాక్ చేస్తుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి, గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడం ఖాయం. ప్రస్తుతం అరాగ్చీ రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న గ్యాస్ ఎగుమతి దేశాల వేదిక శిఖరాగ్ర సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు కూడగట్టడానికే ఇరాన్ నేతలు ఈ సమావేశాన్ని వాడుకుంటున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఇంత తీవ్రంగా హెచ్చరించడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల చేసిన కీలక ప్రకటన. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ అతిపెద్ద ముప్పు అని, ఆ ముప్పును సమూలంగా తొలగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి తాను ఏమైనా చేయగలనని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భీకరమైన దాడి చేశాయి. అప్పటినుంచి ఈ రెండు దేశాల మధ్య ఒక అప్రకటిత యుద్ధం నడుస్తూనే ఉంది. ఇరాన్ ప్రాక్సీలైన హిజ్బుల్లా, హమాస్, హౌతీలను అణచివేస్తూనే, డైరెక్ట్ గా ఇరాన్ పై దాడులు చేసే అవకాశాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల పదే పదే ప్రస్తావిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం ఇజ్రాయెల్‌కు మరింత బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ముందస్తుగా గ్లోబల్ మార్కెట్ల భయాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచుతోంది. తద్వారా పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపుతాయని ఇరాన్ వ్యూహం.



