భారత్ 6జీ విజన్ 2030: 2జీ నుంచి 6జీ వరకు భారతదేశ డిజిటల్ ప్రయాణం
కామెంట్లు (0)

ఒకప్పుడు 2జీ రోజుల్లో కిలోబైట్ల (KB) స్పీడ్తో, అధిక ధరలకు లభించే నెట్ డేటా కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అక్కడి నుంచి నేడు చవకైన ధరలకే హై-స్పీడ్ 4జీ, 5జీ సేవలు ప్రతి సామాన్యుడి చేతికి అందే స్థాయికి భారతదేశం చేరుకుంది. యూపీఐ (UPI) పేమెంట్లు, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ మరియు ఆన్లైన్ ఉపాధి రంగాల్లో ఊహించని విప్లవం వచ్చింది. అయితే, 2030 నాటికి దేశంలోకి రాబోతున్న 6జీ సాంకేతికత ఈ డిజిటల్ విప్లవాన్ని మరో సమున్నత స్థాయికి తీసుకెళ్లబోతోంది. 6జీ నెట్వర్క్ ప్రధాన బలం దాని అపారమైన వేగం మరియు డేటా ప్రసారంలో ఆలస్యం లేకపోవడం. 5జీ కంటే దాదాపు 50 నుండి 100 రెట్లు వేగంగా పనిచేసే ఈ సాంకేతికతతో, గిగాబైట్ల ఫైళ్లను లేదా 8K లైవ్ స్ట్రీమింగ్ను క్షణాల వ్యవధిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్రౌజింగ్ లేదా గేమింగ్లో ఏమాత్రం బఫరింగ్ అనేది లేకుండా అత్యంత స్మూత్ డిజిటల్ అనుభూతి లభిస్తుంది.
6జీ యుగంలో వీడియో కాల్స్ కేవలం ఫ్లాట్ స్క్రీన్లకే పరిమితం కావు. హెలోగ్రాఫిక్ డిస్ప్లే వంటి టెక్నాలజీలతో వ్యక్తులతో మన ముందే ప్రత్యక్షంగా నిలబడి మాట్లాడుతున్నఎక్స్పీరియెన్స్ చేయవచ్చు.
భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వైద్య అసమానతలను తొలగించడంలో 6జీ కీలక పాత్ర పోషించనుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. 6జీలోని జీరో లెటెన్సీ వల్ల విదేశాల్లో లేదా మెట్రో నగరాల్లో ఉండే నిపుణులైన డాక్టర్లు, సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగులను ట్రీట్ చేయగలుగుతారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడటంలో ఇది ఒక గొప్ప వరంగా మారనుంది. అలాగే మనకెంతో కీలకమైన వ్యవసాయ రంగంలో 6జీ కీలక పాత్ర పోషించనుంది. శాటిలైట్ నెట్వర్క్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్టివిటీతో పొలంలోని నేల తేమ, పంట ఆరోగ్యం, పురుగుల దాడి వంటి వివరాలను డ్రోన్ల ద్వారా రియల్ టైమ్ డేటాతో ట్రాక్ చేయవచ్చు. స్వయం డ్రైవింగ్ ట్రాక్టర్లు, ఆటోమేటిక్ ఇరిగేషన్ సిస్టమ్స్ లతో వ్యవసాయం మరింత లాభదాయకంగా, ఆధునికంగా మారుతుంది.
