భూగర్భంలో ఇరాన్ బ్రహ్మాస్త్రం..ఖంగుతిన్న అమెరికా, ఇజ్రాయెల్

ఇటీవల ఇజ్రాయెల్ , అమెరికా దళాలు సంయుక్తంగా చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ కు చెందిన పలు కీలకమైన మిలిటరీ బేస్‌లు, మిస్సైల్ ప్రయోగ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఇరాన్ మిలిటరీ పవర్ తగ్గిపోయిందని అంతా భావించారు. కానీ ఇరాన్ అక్కడితో ఆగిపోలేదు తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని, శత్రువుల కళ్లుగప్పేలా ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ తో ముందుకొచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ రాడార్లు పసిగట్టలేని విధంగా, వారి బాంబులు ఛేదించలేని విధంగా తన మొత్తం మిలిటరీ మౌలిక సదుపాయాలను భూగర్భంలోకి మార్చేస్తోంది. తాజాగా బయటకు వచ్చిన శాటిలైట్ చిత్రాలు పశ్చిమ దేశాల నిఘా వర్గాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా జరిపిన కచ్చితమైన దాడులతో ఇరాన్ మిలిటరీకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. భూమి మీద ఓపెన్ గా ఉన్న ఏ మిలిటరీ స్థావరం కూడా సురక్షితం కాదని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న తమ ఆయుధ కర్మాగారాలను, బాలిస్టిక్ మిస్సైల్ స్థావరాలను అత్యంత సీక్రెట్ గా పునర్నిర్మిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ నివేదికలు, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ లోని రెండు ప్రధాన మిస్సైల్ సైట్లలో భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ కు చెందిన అత్యంత కీలకమైన నాటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ కి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటైన్ వద్ద రాత్రింబవళ్లు నిర్మాణ పనులు సాగుతున్నాయి. తాజాగా బయటపడిన శాటిలైట్ చిత్రాల్లో ఆ పర్వతం వద్ద రోడ్ల విస్తరణ, పటిష్టమైన కాంక్రీట్ ప్రవేశద్వారాలు నిర్మిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ పర్వతం లోపల ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తోందా? లేక ఆయుధాలను అసెంబుల్ చేస్తోందా? అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్లను ఇరాన్ తమ అణు కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శత్రు దేశాల శాటిలైట్లను బురిడీ కొట్టించడానికి ఇరాన్ ఒక సరికొత్త టెక్నిక్ వాడుతోంది. మిస్సైల్ లాంచర్లను, ఆయుధాలను తరలించడానికి మిలిటరీ ట్రక్కులకు బదులుగా, సాధారణ పౌర వాహనాల ముసుగులో ఉన్న వాహనాలను వాడుతోంది. దీనివల్ల ఇవి సాధారణ ట్రక్కులా, లేక ఆయుధాలు మోసుకెళ్లే లాంచర్లా అన్నది అమెరికా ఇంటెలిజెన్స్ సైతం సులభంగా పసిగట్టలేకపోతోంది.



