మళ్లీ అలాంటి దుస్సాహసానికి పాక్ ఉగ్రవాదుల కుట్ర..! అలెర్ట్ అయిన భారత్…మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?

2008 నవంబర్ 26.. ముంబై మహానగరంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 18 సంవత్సరాలు కావొస్తోంది. సముద్ర మార్గం గుండా వచ్చి ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ హోటల్, కామా హాస్పిటల్ లో వాళ్లు చేసిన దుర్మార్గానికి అజ్మల్ కసబ్ మినహా మిగతా ఉగ్రవాదులందరూ హతమయ్యారు. దానికి మాస్టర్ మైండ్ అయిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంకా పాకిస్థాన్ లో సేఫ్ గానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసే ఒక సంచలన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నా కూడా పాకిస్థాన్ ఏమాత్రం భయం లేకుండా, ఇండియాపై మరో భారీ అటాక్ చేయడానికి లష్కరే ఉగ్రవాదులకు పక్కాగా శిక్షణ ఇప్పిస్తోంది. పాకిస్థాన్ పోర్ట్ సిటీ అయిన కరాచీ సమీపంలో ఇప్పుడు లష్కరే తోయిబాకు చెందిన ఒక స్పెషల్ గ్రూప్ కు అత్యంత కఠినమైన ట్రైనింగ్ జరుగుతోంది. ఈ గ్రూప్ కే దావా మెరైన్ వింగ్ , సదా-ఏ-హుర్రియత్ అని పేరు పెట్టారు. 2008లో ముంబై దాడుల తర్వాత ఇలాంటి గ్రూప్ నే కరాచీలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుతోంది లష్కరే. ఈసారి ఏకంగా సముద్ర గర్భంలో కూడా ఆపరేషన్స్ చేసేలా వీరికి వాటర్ సర్వైవల్, స్కూబా డైవింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. బయటి ప్రపంచానికి అనుమానం రాకుండా ఉండేందుకు, ఈ ఉగ్రవాదులు అంతా లీజర్ యాక్టివిటీస్ కోసం వచ్చిన సాధారణ టూరిస్టుల ముసుగులో ఈ శిక్షణ తీసుకుంటున్నారు. లష్కరేకు సంబంధించిన ప్రాక్సీ ఆర్గనైజేషన్ అయిన పాకిస్తానీ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో పాక్ మిలిటరీ మద్దతుతోనే ఈ ట్రైనింగ్ జరుగుతున్నట్లు భారత ఇంటెలిజెన్స్ పసిగట్టింది. సముద్ర మార్గం గుండా ఇండియాలోని తీర ప్రాంతాల్లో 26/11 కంటే భారీ విధ్వంసం సృష్టించాలన్నదే హఫీజ్ సయీద్ తాజా ప్లాన్. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండాల్సిన ఈ ఉగ్రవాదులు కరాచీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? దీని వెనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక సంచలన ఆపరేషన్ ఉంది. అదే ఆపరేషన్ సింధూర్. పీవోకేలోని మంగళా డ్యామ్ దగ్గర లష్కరే ఉగ్రవాదులు క్యాంపులు ఏర్పాటు చేసుకోగా, గత ఏడాది ఇండియన్ ఫోర్సెస్ వాటిపై బాంబులతో దాడి చేసి నామరూపాలు లేకుండా చేశాయి. ఆ దెబ్బకు భయపడి, అక్కడైతే ఇండియన్ దళాలు ఈజీగా ఎటాక్ చేస్తాయని, ఈ దావా మెరైన్ వింగ్ ను సేఫ్ గా కరాచీ పోర్ట్ దగ్గరకు మార్చారు. అయితే కరాచీలో వాళ్లు తీసుకుంటున్న ట్రైనింగ్ లొకేషన్, ముంబైలోని ఇండియన్ నావీ ఫెసిలిటీస్ రాడార్ కు చాలా దగ్గరగా ఉంది. వాళ్లు సముద్రంలో ఏ చిన్న కదలిక చేసినా మన నావీ రాడార్లు ఇట్టే పసిగట్టేస్తాయి. ఇండియాలో అలజడి సృష్టించాలని పాకిస్థాన్ ఎంత ప్రయత్నిస్తున్నా, ముంబై తీరంలో అణువణువూ స్కానింగ్ లోనే ఉంది. అయితే ఇక్కడ ఇండియాకు ఉన్న ఒకే ఒక్క టెన్షన్.. లోకల్ సపోర్ట్.
లష్కరే తోయిబా కేవలం సముద్ర మార్గం గుండానే కాదు, లోపలి నుంచి కూడా ఇండియాను దెబ్బతీయాలని స్కెచ్ వేసింది. జమ్మూ కాశ్మీర్ లోని యువతను రాడికలైజ్ చేసి , ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా ఒక లష్కరే మాడ్యూల్ పనిచేస్తోందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. శ్రీనగర్, బుద్గాం, బిజ్బెహారా, అనంత్‌నాగ్, పుల్వామా పరిధిలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో కీలకమైన డిజిటల్ పరికరాలు, దేశ వ్యతిరేక సామగ్రి, ఉగ్రవాద రిక్రూట్ మెంట్ కు సంబంధించిన పక్కా ఆధారాలు దొరికాయి. అంటే అటు కరాచీ నుంచి మెరైన్ అటాక్ కు ప్లాన్ చేస్తూనే, ఇటు కాశ్మీర్ లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా ఏకకాలంలో రెండు వైపులా దాడులు చేయాలన్నది లష్కరే ఉగ్రవాదుల కుట్రగా తెలుస్తోంది. పాకిస్థాన్ ఎన్నిసార్లు దెబ్బతిన్నా వాళ్ల బుద్ధి మారదు. 26/11 లాంటి దాడులు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా ఊరుకునే ప్రసక్తే లేదు. భారత్ ప్రకోపానికి ఈసారి గట్టి మూల్యమే చెల్లించుకుంటుంది.



