మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు..వణుకుపుట్టిస్తున్న ఇరాన్ మైండ్ గేమ్

ప్రఖ్యాత అమెరికన్ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన తాజా కథనం ప్రకారం.. సౌదీ అరేబియా , హౌతీ రెబల్స్ మధ్య తెరవెనుక భారీ చర్చలు జరుగుతున్నాయి. గత 11 ఏళ్లుగా యెమెన్ సివిల్ వార్ లో సౌదీ అరేబియా జోక్యం చేసుకుని, తమ దేశంపై ఎన్నో వైమానిక దాడులు చేసిందని, కఠినమైన దిగ్బంధనం విధించిందని హౌతీలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల యెమెన్ దేశం పూర్తిగా నాశనమైందని, ఇప్పుడు ఆ నష్టపరిహారం, పునర్నిర్మాణ ఖర్చుల కింద తమకు ఏకంగా 51 బిలియన్ డాలర్లు అంటే సుమారు 4 లక్షల 30 వేల కోట్ల రూపాయలు చెల్లించాలని హౌతీలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రస్తుత యెమెన్ ప్రభుత్వానికి సౌదీ తన మద్దతును పూర్తిగా ఉపసంహరించుకోవాలని హౌతీలు కండిషన్ పెట్టారు. అధికారికంగా హౌతీలనే యెమెన్ చట్టబద్ధమైన పాలకులుగా సౌదీ అరేబియా గుర్తించాలని తేల్చిచెప్పారు. ఒక రెబల్ గ్రూప్ తో అధికారికంగా ఒప్పందం చేసుకుంటే, ప్రపంచం దృష్టిలో సౌదీ అరేబియా పరువు పూర్తిగా పోతుంది. కానీ ఈ షరతులను ఒప్పుకోకపోతే, జరిగే నష్టం మరింత భయంకరంగా ఉండబోతోందని హౌతీలు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన చమురు ఎగుమతులను హౌతీలు టార్గెట్ చేశారు. ఎర్ర సముద్రంలో వెళుతున్న రియాద్ ఆయిల్ ట్యాంకర్లపై హౌతీలు వరుస దాడులకు దిగుతున్నారు. అలాగే బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి సమీపంలో ఉన్న వ్యూహాత్మక నగరమైన మోఖా ను కూడా హౌతీలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల అక్టోబర్ నెలలో సౌదీ అరేబియాలోని చమురు కర్మాగారాలు, ఎయిర్ పోర్టుల పైకి దాదాపు ప్రతిరోజూ హౌతీలు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఇస్లాం మతంలో రెండవ అత్యంత పవిత్ర నగరమైన మదీనా వైపుగా వచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని కూడా సౌదీ దళాలు ఇంటర్సెప్ట్ చేసి కూల్చేశాయి. ఇలా దేశం నలుమూలల నుంచి దాడులు జరుగుతుండటం, విదేశీ పెట్టుబడులు రాకుండా ఆగిపోతుండటంతో.. ఎలాగైనా ఈ తలనొప్పిని వదిలించుకోవాలని సౌదీ యువరాజు ఎంబీఎస్ శాంతి చర్చలకు ప్రతిపాదించారు. యెమెన్ అధికారిక ప్రభుత్వానికి రాజధానిగా ఉన్న దక్షిణ ఓడరేవు నగరం ఏడెన్ ను హౌతీలు టార్గెట్ చేశారు. 2015 తర్వాత మొదటిసారిగా ఆ నగరానికి కేవలం 50 మైళ్ల దూరంలోకి హౌతీ బలగాలు చేరుకున్నాయి. అక్టోబర్ 31న ఏడెన్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పైకి ఏకంగా రెండు క్షిపణులను ప్రయోగించి తమ సత్తా చాటారు. సౌదీ అరేబియా ఈ డిమాండ్లను ఒప్పుకుంటే జరిగే అతిపెద్ద నష్టం ఏంటంటే.. తన దక్షిణ సరిహద్దులో ఇరాన్ కు మద్దతు ఇచ్చే ఒక సాయుధ రాజ్యాన్ని అఫీషియల్ గా అంగీకరించినట్లు అవుతుంది. హౌతీల వెనుక ఉండి ఆయుధాలు, నిధులు ఇస్తోంది ఇరాన్ అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇన్నాళ్లూ ఒక రెబల్ గ్రూప్ గా ఉన్న హౌతీలను, ఒక దేశ అధికారిక ప్రభుత్వంగా గుర్తిస్తే ఇరాన్ ప్రాక్సీలకు పూర్తి చట్టబద్ధత లభిస్తుంది. ఇది మిడిల్ ఈస్ట్ జియో-పాలిటిక్స్ లో సౌదీ అరేబియాకు ఒక తీరని మచ్చగా, అతిపెద్ద వ్యూహాత్మక ఓటమిగా మిగిలిపోతుంది. సౌదీ అరేబియా కలల ప్రాజెక్ట్ అయిన విజన్ 2030 సక్సెస్ అవ్వాలంటే దేశంలో శాంతి ఉండాలి. ఇన్వెస్టర్లు రావాలంటే తమ ఆయిల్ ఫ్యాక్టరీలపై దాడులు ఆగిపోవాలి. అందుకే హౌతీల ముందు సౌదీ కాస్త తగ్గింది. కానీ 51 బిలియన్ డాలర్లు ఇవ్వడం, ఒక రెబల్ గ్రూప్ ను పాలకుడిగా గుర్తించడం అనేది సౌదీ సార్వభౌమాధికారానికే అతిపెద్ద అవమానం.మరి హౌతీల డిమాండ్స్ ను సౌదీ ఒప్పుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.



