మెగావర్స్ గెస్టుల లిస్ట్ అదిరిపోయింది..!

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వస్తే టాక్ షో వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగావర్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ వేశారు. ఇప్పటికే ఈ టాక్ షోకు సంబంధించిన రెండు ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తయినట్లు ఇన్ సైడ్ టాక్. మొదటి ఎపిసోడ్ అంతా నవ్వుల మయంగా ఉండాలని, చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు చేసిన కామెడీ కింగ్ బ్రహ్మానందం , అలాగే సునీల్, సత్య లాంటి స్టార్ కమెడియన్స్ తో ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్ చేశారని తెలుస్తోంది. ఇక రెండో ఎపిసోడ్ లో ఊహించని సర్ ప్రైజ్ ఏంటంటే.. ఉలగ నాయగన్ కమల్ హాసన్ . చిరంజీవి కెరీర్ మొదట్లో కమల్ హాసన్‌తో కలసి కె. బాలచందర్ తెరకెక్కించిన ఇది కథకాదు చిత్రంలో నటించారు. నాటి నుంచీ వారిద్దరి మధ్య ఎంతో అద్భుతమైన స్నేహం ఉంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే వేదికపై కూర్చుని 40 ఏళ్ల నాటి సినిమా ముచ్చట్లు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ లా ఉండబోతోందని సమాచారం. చిరంజీవి టైమింగ్, కమల్ ఇంటలెక్చువల్ మాటలతో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందని టాక్. సాధారణంగా టాక్ షోలలో ఒకరిద్దరు హీరోలు వస్తారు. కానీ చిరంజీవి రేంజ్ కి, నెట్‌ఫ్లిక్స్ బడ్జెట్ కి తగినట్లుగా ఏకంగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలే ఈ షోలో దిగిపోతున్నాయి. నాగార్జునకు, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మెగావర్స్ లోని ఒక స్పెషల్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో కలిసి సందడి చేయబోతున్నారు. అంతేకాకుండా మరో ఎపిసోడ్లో టాలీవుడ్ కు ఎంతో బంధుత్వం ఉన్న దగ్గుబాటి కుటుంబం కూడా రాబోతోంది. రీసెంట్ గా చిరంజీవికి వచ్చిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కు వెంకటేష్ వచ్చి సందడి చేశారు. నాగార్జున, వెంకటేష్ లాంటి ఇండస్ట్రీ పిల్లర్స్ ఒకరి తర్వాత ఒకరు చిరు షోకి వస్తుండటంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. మెగావర్స్ షోకే హైలైట్ గా నిలవబోయే మరో అతిపెద్ద ఎపిసోడ్ ఒకటి ఉంది. మెగా ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కల అది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , చిరంజీవి ఒకే స్టేజ్ పై, ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. బుల్లితెరపై పవన్, చెర్రీతో కలసి చిరంజీవి కనిపించడం, ఎవరికీ తెలియని వారి చిన్ననాటి విషయాలు, పాలిటిక్స్, సినిమాల గురించి చర్చించడం ఈ షోకి టీఆర్పీలను బద్దలుకొట్టడం ఖాయం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ షోకి రాబోతున్నారని టాక్. రజనీకాంత్, చిరంజీవి కలిసి గతంలో బందిపోటు సింహం, కాళి వంటి చిత్రాల్లో నటించారు. ఒకరి సినిమాలను మరొకరు రీమేక్స్ చేసుకున్నారు. రజనీకాంత్ తన పిల్లలతో కలిసి ఒక స్పెషల్ ఎపిసోడ్ లో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు మనం విన్న పేర్లన్నీ చిరంజీవితో కలసి నటించినవారు, ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పలుకుబడికి నిదర్శనంగా వచ్చే కుటుంబసభ్యులే కావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ ఈ మెగావర్స్ షోని భారీ బడ్జెట్ తో, ఇంటర్నేషనల్ క్వాలిటీతో తెరకెక్కిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి ఈ షో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.



