రామాయణకు పైరసీ సమస్య లేకుండా రంగంలోకి బాంబే హైకోర్టు..లీక్ చేస్తే కఠిన చర్యలు..!

నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. ఇలాంటి వందల కోట్ల భారీ సినిమాలకు ప్రస్తుతం పైరసీ అనేది పెద్ద సమస్య.
ఇప్పటికే రామాయణ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మేకర్స్ కు నిద్రలేకుండా పోయింది. అందుకే రామాయణ నిర్మాతలు డైరెక్ట్ గా కోర్టు మెట్లు ఎక్కారు. ఈ విషయంలో వాళ్లకు అండగా నిలుస్తూ ముంబై హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది.
రామాయణ సినిమా ఇండియన్ సినిమా గర్వించదగ్గ ప్రాజెక్ట్. అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, యష్ కూడా ఈ నిర్మాణంలో ఒక భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌తో పాటు ప్రముఖ హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి భారతీయ పురాణ గాథను ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయాలనేది మేకర్స్ సంకల్పం. అయితే, థియేటర్లలో విడుదలకు ముందే సినిమా దృశ్యాలు, పాటలు, కీలక సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అయితే చిత్ర బృందానికి వందల కోట్ల నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను ముందుగానే అడ్డుకునేందుకు రామాయణ నిర్మాతలు ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. థియేటర్లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన కంటెంట్ ఏదో సోషల్ మీడియాలో నాసిరకం క్వాలిటీతో కనిపిస్తే సినిమాకు జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అందుకే నిర్మాతల ఆవేదనను అర్థం చేసుకున్న ముంబై హైకోర్టు ఒక కీలకమైన, సంచలన తీర్పును ఇచ్చింది. సినిమా పైరసీ, అనధికారిక వీడియో క్లిప్పుల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా డైనమిక్ ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా ఎవరైనా పైరసీ చేస్తే వాళ్ల మీద కేసు వేసి, కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుని ఆ లింక్ ను తొలగించాలి. కానీ ఈ డైనమిక్ ఇంజంక్షన్ ఉంటే.. ప్రతిసారీ కోర్టుకు వెళ్లాల్సిన పనిలేదు. సినిమా పేరుతో అనధికారికంగా ఎవరైనా ఫొటోలు, లింకులు, వీడియోలు, క్లిప్పులు ఏ వెబ్సైట్లలో గానీ, యూట్యూబ్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ ఫామ్స్ పై గానీ అప్లోడ్ చేస్తే.. డైరెక్ట్ గా పోలీసులకు లేదా ఆయా ప్లాట్ ఫామ్స్ కు ఫిర్యాదు చేసి క్షణాల్లో ఆ కంటెంట్ ను బ్లాక్ చేయించవచ్చు. దీనిపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే పవర్ కూడా నిర్మాతలకు వస్తుంది.
ముంబై హైకోర్టు ఇచ్చిన ఈ డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్ అనేది డిసెంబర్ మధ్య వరకు అమల్లో ఉంటుంది. అంటే ఈ రెండు నెలల వ్యవధిలో రామాయణ కు సంబంధించిన ఎలాంటి అనధికారిక కంటెంట్, పైరసీ లింకులు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి ఈ ఆదేశాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి లీక్డ్ వీడియోలు షేర్ చేసినా, వాళ్ల ఐపీ అడ్రస్ లను ట్రేస్ చేసి కఠిన చర్యలు తీసుకునే వీలు ఉంటుంది. భారీ పెట్టుబడితో రూపొందుతున్న సినిమాను పైరసీ నుంచి రక్షించుకోవడంలో రామాయణ నిర్మాతలు తీసుకున్న ఈ ముందస్తు న్యాయపరమైన చర్యకు ఇండస్ట్రీ వర్గాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక సినిమా వెనుక ఎంతోమంది కష్టం, ఎన్నో వందల కోట్ల పెట్టుబడి ఉంటుంది. అందుకే. ముంబై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం రామాయణ మేకర్స్ కే కాకుండా, రాబోయే ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు ఒక గైడ్ లైన్ లా ఉపయోగపడుతుంది.



