బంగ్లాదేశ్లో మళ్లీ అస్థిర పరిస్థితులు..ఢాకా వీధుల్లో తీవ్ర హింస

బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుకుతోంది. 2024 జూలైలో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఎలాంటి తీవ్ర హింసాత్మక ఆందోళనలు జరిగాయో తెలిసిందే. కాగా, మరోసారి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఏకంగా 10 లక్షల మందికి పైగా కార్మికులు రోడ్లపైకి వచ్చి భయంకరమైన నిరసనలకు దిగారు. పోలీసుల మీద దాడులు, వాహనాలకు నిప్పు పెట్టడం, హైవేల దిగ్బంధనంతో బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంలా మారింది. దాదాపు 28 నెలల తర్వాత మరోసారి బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్టోబర్ 31న ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి రోడ్ల మీదకు వచ్చింది గతంలో మాదిరిగా స్టూడెంట్స్ కాదు.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన గార్మెంట్ పరిశ్రమ కార్మికులు. తమ కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొద్దిగంటల్లోనే ఈ నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి. ఢాకాలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలైన మిర్పూర్, ఆశులియా, సావర్, గాజీపూర్ వంటి ప్రాంతాల్లో కార్మికులు రహదారులను పూర్తిగా దిగ్బంధించారు. వందలాది గార్మెంట్ ఫ్యాక్టరీలను బలవంతంగా మూసివేయించారు. ఈ నిరసనలు, సమ్మెల కారణంగా ఏకంగా 529 ఫ్యాక్టరీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులపై కార్మికులు ఘర్షణకు దిగారు. ఏకంగా పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు బస్సులపై రాళ్ల దాడులు చేసి భారీ విధ్వంసం సృష్టించారు. ఏకంగా పోలీసుల వాహనాలకే నిప్పు పెడుతున్నారంటే ఆ కార్మికుల్లో ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆ నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ , వాటర్ కేనన్లు, సౌండ్ గ్రెనేడ్లు భారీగా ప్రయోగించారు. అయినా సరే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఏకంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలను కూడా ప్రభుత్వం మోహరించింది. సెలవుల తర్వాత సోమవారం ఫ్యాక్టరీలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం భావించింది. కానీ పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. కార్మికులు మళ్లీ రోడ్లపైకి రావడంతో ఢాకాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
అక్కడి గార్మెంట్ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారు నెలకు కనీస వేతనంగా 30 వేల బంగ్లాదేశీ టాకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటానికి దిగారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు కేవలం 12వేల టాకాల వేతనం మాత్రమే అందుతోందని తెలుస్తోంది. దేశంలో ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. బియ్యం, పప్పుల లాంటి నిత్యావసర ఆహార పదార్థాల ధరలు, ఇంటి అద్దెలు, రవాణా, అలాగే వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. దీంతో తమ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ 12 వేల చాలీచాలన జీతంతో కుటుంబాన్ని పోషించడం, పిల్లలను చదివించుకోవడం దాదాపు అసాధ్యంగా మారిపోయిందని వాపోతున్నారు. అందుకే కనీస వేతనం 30 వేల టాకాలు చేసేవరకు ఈ పోరాటం ఆపేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దీని వెనుక ఒక అతిపెద్ద పొలిటికల్ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ నిరసనలు, ఢాకాలో అశాంతి వెనక.. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్న పారిశ్రామికవేత్తల హస్తం ఉందని బంగ్లాదేశ్ డైరెక్ట్ గా ఆరోపిస్తోంది. అసలు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ గార్మెంట్ ఇండస్ట్రీ పైనే ఆధారపడి ఉంది. ప్రపంచంలోని ప్రముఖ వస్త్ర ఎగుమతిదారుల్లో చైనా తర్వాత బంగ్లాదేశ్ దే రెండో స్థానం. ఆ దేశానికి కావాల్సిన విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో ఈ రంగం అత్యంత కీలకంగా ఉంది. యూరప్, అమెరికాలతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో బంగ్లాదేశీ తయారీ దుస్తులకు మంచి గిరాకీ ఉంది. జియో, జారా లాంటి ఎన్నో ఫేమస్ గ్లోబల్ బ్రాండ్స్ కు సంబంధించిన టీ-షర్టులు, షర్టులు, ట్రౌజర్లు, జీన్స్, జాకెట్లు వంటి రెడీమేడ్ దుస్తులను ఇక్కడి ఫ్యాక్టరీల్లోనే తయారు చేస్తారు. ఈ పరిశ్రమలో లక్షలాది మంది పనిచేస్తుండగా, వారిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగా ఉంది.



