భారత్ తో ట్రేడ్ లేకుంటే ఇది పాక్ పరిస్థితి...ఏకంగా 3.50 లక్షల కోట్లు నష్టం

2019లో పుల్వామాలో జరిగిన ఆ ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడు. ఆ దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన దాడికి జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థే కారణం. ఆ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను మట్టికరిపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం సైనిక చర్యతో మాత్రమే ఆగిపోలేదు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఒక సైలెంట్ వార్ స్టార్ట్ చేసింది. పాకిస్థాన్ ఆయువుపట్టును గట్టిగా దెబ్బకొట్టింది. ఆ ఒక్క దెబ్బతో గడిచిన ఐదారేళ్ల వ్యవధిలో పాకిస్థాన్ దాదాపుగా 3 లక్షల 50వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను నష్టపోయింది. ఈ చేదు నిజాన్ని ఇండియన్ మీడియా చెప్పట్లేదు, స్వయంగా పాకిస్థాన్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా వెల్లడించి పాక్ పాలకుల గుండెల్లో గుబులు రేపారు.
భారతదేశం 2019లో పాకిస్థాన్ పై ట్రేడ్ సస్పెన్షన్ వేసినప్పుడు, పాక్ పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. మాకు చైనా ఉంది, అమెరికా ఉంది ఇండియా మమ్మల్ని ఏం చేస్తుంది అని విర్రవీగారు. కానీ ఐదేళ్లు తిరిగేసరికి వాళ్లకు అసలు సినిమా కనిపించింది. ఇస్లామాబాద్ లో ఇటీవల జరిగిన బిజినెస్ అడ్వకసీ గ్రూప్ సమావేశంలో పాకిస్తాన్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ నూర్ మహ్మద్ కసూరి సంచలన విషయాలు బయటపెట్టారు. భారత్తో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఈ అయిదేళ్ల కాలంలో తమ దేశం ఏకంగా 40 బిలియన్ డాలర్ల మేర భయంకరమైన నష్టాన్ని చవిచూసిందని ఆయన స్పష్టం చేశారు. పక్కనే భౌగోళికంగా ఇండియా ఉన్నప్పటికీ.. భారత్ తో ట్రేడ్ బంద్ అవ్వడంతో, పాకిస్థానీ పరిశ్రమలు తమకు కావలసిన అత్యవసర ముడిసరుకులు, ఇతర నిత్యావసర వస్తువుల కోసం సుదూరంగా ఉన్న ఇతర ఖండాలు, అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోందని కసూరీ వివరించారు. పక్కనున్న ఇండియా నుంచి సరుకు తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అసలు ఉండేదే కాదు.. కానీ ఇప్పుడు వేరే ఖండాల నుంచి సరుకులను సముద్ర మార్గంలో రవాణా చేయాల్సి వస్తోందని, ఫలితంగా ఫ్రైట్ ఛార్జీలు , డెలివరీ సమయం గణనీయంగా పెరిగిపోయి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.



