రాముడి వనవాసం 14 ఏళ్లే..నాకెందుకు ఈ శిక్ష? ..విడాకులపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని సుమారు 14 సంవత్సరాలు గడిచినా, ఈ సమాజం తనను ఇంకా ఒక వ్యక్తిగా, ఒక మహిళగా గుర్తించడం లేదని, కేవలం పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే చూస్తోందని సీనియర్ నటి రేణు దేశాయ్ తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడు చేసిన వనవాసం 14 ఏళ్లే.. కానీ నా ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు అంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి చెబుతూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. తెలుగు ప్రజల మైండ్ సెట్ గురించి ప్రస్తావిస్తూ..చాలామంది నా జీవితం బద్రి సినిమాతోనే ప్రారంభమైందని భావిస్తారు. అంతకుముందు నాకు ఎలాంటి జీవితమే లేనట్లుగా, ఆయన ద్వారానే నేను ఈ భూమి మీదకు వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది నాకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది అని తన మనసులోని బాధను బయటపెట్టారు. 2012లో పవన్ కళ్యాణ్ కు, తనకు అధికారికంగా విడాకులు వచ్చాయని, అప్పటినుంచి ఇప్పటికి కరెక్ట్ గా 14 ఏళ్లు పూర్తయ్యాయని ఆమె గుర్తుచేశారు. ఈ క్రమంలోనే రామాయణాన్ని ఉదహరిస్తూ.. శ్రీరాముడు కూడా కేవలం 14 ఏళ్లు మాత్రమే వనవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు విముక్తి లభించింది. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? నా ఈ మానసిక క్షోభ ఇంకెన్నాళ్లు? నేను ఇప్పటికీ నా ఉనికి కోసం పోరాడుతూనే ఉన్నాను. నేను ఏ మంచి పని చేసినా, ఏ మాట మాట్లాడినా, నాకు వేరే పేరే లేనట్లు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ముద్ర బలంగా వేస్తున్నారు అంటూ రేణు దేశాయ్ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. తన సొంత ఐడెంటిటీని ఈ సమాజం ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోందని ఆమె ఆక్రోశం వ్యక్తం చేశారు.
రేణు దేశాయ్ తనపైన వస్తున్న కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2012లో విడాకులు తీసుకున్న తర్వాత తానెప్పుడూ ఖాళీగా కూర్చోలేదని ఆమె స్పష్టం చేశారు. తల్లిగా ఇద్దరు పిల్లల బాధ్యతలను ఒంటరిగా మోస్తూనే.. ప్రొఫెషనల్ గా ఎన్నో విజయాలు సాధించానన్నారు రేణు దేశాయ్. సొంతంగా ఒక మరాఠీ సినిమాను నిర్మించి దాన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చేశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో మరాఠీ చిత్రానికి కేవలం నిర్మాతగానే కాకుండా, సొంతంగా కథ అందించి దానికి దర్శకత్వం వహించి మెప్పించానని తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా తెలుగులో పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా పనిచేశాను, ఎన్నో అద్భుతమైన కవితలు రాసి పుస్తకాలు పబ్లిష్ చేశాను, జంతు సంరక్షణ కోసం ఎన్జీఓలు నడుపుతున్నాను, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను అని ఆమె తెలిపారు. నాకంటూ ఎలాంటి వ్యక్తిగత గుర్తింపు, టాలెంట్ లేకపోతే నాకు ఇన్ని రంగాల్లో అవకాశాలు ఎందుకు వస్తాయి? ఆయన లేకపోతే అసలు నాకు బతికే అర్హతే లేదు అన్నట్లుగా సమాజం ఎందుకు మాట్లాడుతోంది? అంటూ ట్రోలర్స్ కు వరుసగా ప్రశ్నలు వేశారు. ఈ ఇంటర్వ్యూలో కేవలం తన పర్సనల్ లైఫ్ గురించే కాకుండా, మహిళల స్వతంత్రత, కుటుంబ బాధ్యతల గురించి కూడా రేణు దేశాయ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన మాజీ భర్త, ఏపీ డప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా రేణు చాలా హుందాగా, మెచ్యూర్డ్ గా స్పందించారు. ఆయన డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని నేను బలంగా నమ్ముతున్నాను. సమాజానికి ఏదో చేయాలన్న తపన ఆయనలో ఉంది అని పాజిటివ్ గానే మాట్లాడారు.



