వన మ్యాన్ షో ..? ‘సీన్’ మూవీ రివ్యూ!

కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ బ్లాక్ బస్టర్స్ తర్వాత..సూర్య సూర్య హీరోగా జీతూ మాధవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సీన్. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, చాలా కాలం తర్వాత నజ్రియా హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తుండటంతో పాటు,నస్లెన్ తొలిసారిగా తమిళ సినీ రంగంలో డెబ్యూ చేయడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. దానికి తోడు, ప్రమోషనల్ స్టఫ్ అంతా వర్కౌట్ కావడంతో, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా అని సూర్య అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ మూవీ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది.
ప్రేమ్‌రాజ్ ఒక టాలెంటెడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. ఎంతో క్లిష్టమైన కేసులను తన తెలివితేటలతో ఇట్టే సాల్వ్ చేసే ప్రేమ్ రాజ్.. తనకున్న ఒక శారీరక సమస్య కారణంగా తన ఉద్యోగాన్ని వదిలేయాలి అనుకుంటాడు. అయితే విక్టర్ అనే సీరియల్ కిల్లర్ వల్ల ప్రేమ్ రాజ్ కు ఉన్న ఆ సమస్య క్రైమ్ బ్రాంచ్ హెడ్ స్టీఫెన్ కు తెలిసిపోతుంది. దీంతో ప్రేమ్‌రాజ్‌ను డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సిటీలో ఓ సైకో కిల్లర్ వరుసగా ఒకే తరహాలో హత్యలు చేస్తుంటాడు. తన పోలీస్ ఉద్యోగం పోయినా సరే, ఈ కేసును పట్టుకుని తీరుతానని స్టీఫెన్‌తో ప్రేమ్‌రాజ్ ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఇన్వేస్టిగేషన్ కోసం మాయ ను తనకు అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యంత తెలివిగా హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ఈశ్వర్ ను చూపు లేని ప్రేమ్‌రాజ్ ఎలా పట్టుకున్నాడు? ఈ ప్రయాణంలో మాయతో ప్రేమ్‌రాజ్‌కు ఉన్న అనుబంధం ఎలా మారింది? అన్నదే ఈ సీన్ సినిమా కథ.
సాధారణంగా ఒక సీరియల్ కిల్లర్ మూవీ అంటే హీరోకు, విలన్ కు మధ్య మైండ్ గేమ్స్ ఉండాలి, సీట్ ఎడ్జ్ థ్రిల్స్ ఉండాలి. కానీ డైరెక్టర్ జీతూ మాధవన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా తడబడ్డారు అని పబ్లిక్ టాక్. విలన్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వేసే ఎత్తుగడలు చాలా సిల్లీగా అనిపిస్తాయంటున్నారు. హీరో అంధుడు కాబట్టి, ఆయన ఇంటెలిజెన్స్ ను ఎలివేట్ చేయడం కోసం డిపార్ట్మెంట్ లోని మిగతా పోలీసులందరినీ పెద్ద జోకర్లుగా చూపించడం సినిమాలో సహజత్వాన్ని దెబ్బతీసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాన పాత్రలన్నింటికీ ఏదో ఒక వీక్ నెస్ ఉన్నట్లు చూపించినా, వాటి బ్యాక్ గ్రౌండ్ పై సరైన క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా విలన్ పాత్రలో ఏమాత్రం బలం లేకపోవడం వల్ల క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన మెయిన్ ఉత్కంఠే లోపించింది. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో ఎలివేషన్ అంత బాగా పేలుతుంది. కానీ ఇక్కడ హీరోకు అన్నీ ఈజీగా కలిసిరావడం, పరిస్థితులు అతనికి అనుకూలంగా మారిపోవడం లాజిక్ లెస్ గా అనిపిస్తాయని పబ్లిక్ టాక్ . డైరెక్టర్ ఆవేశం సినిమాలో పండించిన డార్క్ కామెడీ మ్యాజిక్ ఇందులో రిపీట్ కాలేదు. కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ కు సింక్ అవ్వక ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురవుతారు. ఈ సినిమాకు ఉన్న ఏకైక అతిపెద్ద బలం సూర్య . రొటీన్ కమర్షియల్ మాస్ ఎలివేషన్లు, ఫైట్లు, రొమాంటిక్ ట్రాక్‌లకు దూరంగా ఉంటూ ఒక బ్లైండ్ ఆఫీసర్ పాత్రను ఒప్పుకోవడమే ఆయన చేసిన పెద్ద సాహసం. కళ్ళు కనిపించకపోయినా చాలా స్టైలిష్‌గా, జోవియల్ బాడీ లాంగ్వేజ్‌తో తన అద్భుతమైన నటనతో సూర్య సినిమాను సింగిల్ హ్యాండ్ తో మోశాడు. ఇక నజ్రియా నజీమ్ మాయ పాత్రలో తన క్యూట్ పర్ఫార్మెన్స్తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. గెస్ట్ రోల్స్ లో కనిపించిన జ్యోతిక, టొవినో థామస్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తారు. టెక్నికల్ గా చూసుకుంటే, మలయాళంలో తన మ్యూజిక్ తో పూనకాలు తెప్పించే సుశీన్ శ్యామ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. కానీ ఇందులో ఆయన బీజీఎమ్ తీవ్రంగా నిరాశపరుస్తుందని సూర్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. థ్రిల్లర్ మూడ్ క్రియేట్ చేయాలో, కామెడీని ఎలివేట్ చేయాలో అర్థం కాక ఆయన మ్యూజిక్ తేలిపోయిందంటున్నారు. వినీత్ అగస్టీన్ కెమెరా వర్క్ బాగుంది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 29 నిమిషాలే అయినా, సగానికి పైగా కథ ఒకే ఇంట్లో జరగడం వల్ల స్క్రీన్‌ప్లే బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ గా సీన్ మూవీ లాజిక్స్ లేని ఒక ప్రయోగాత్మక క్రైమ్ థ్రిల్లర్. కేవలం సూర్య నట విశ్వరూపాన్ని, ఆయన చేసిన ఈ సరికొత్త ప్రయత్నాన్ని మాత్రమే చూడాలనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చుతుంది.



