వివాదంలో ప్రభాస్-హను రాఘవపూడి 'ఫౌజీ'.. నేతాజీ మునిమనవడు ఏమన్నారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ..విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సాధారణంగా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీస్తున్నప్పుడు, అందులో నిజ జీవిత జాతీయ నాయకుల పాత్రలను చూపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతుంది. ఇప్పుడు ఫౌజీ సినిమా విషయంలో అదే జరుగుతోంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ పై సుభాష్ చంద్రబోస్ మునిమనవడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఫౌజీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో సమావేశమయ్యే ఒక పవర్ ఫుల్ సన్నివేశాన్ని చూపించారు. ఆ సీన్ చూసి ఫ్యాన్స్ అంతా థ్రిల్ అయ్యారు. కానీ, ఆ సన్నివేశంపై ఇప్పుడు నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్‌తో మాట్లాడుతూ.. ఫౌజీ అనే ఒక యోధుడి గురించి వివరిస్తుంటారు. ప్రభాస్ పోషిస్తున్న ఆ కల్పిత పాత్రను నేతాజీ హిట్లర్‌కు పరిచయం చేస్తూ, ఆ క్యారెక్టర్ కి అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లుగా ఆ సన్నివేశం డిజైన్ చేయబడిందని పలువురు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా దేశం కోసం పోరాడిన నేతాజీ లాంటి మహనీయుడి పాత్రను.. కేవలం సినిమాలో హీరోను ఎలివేట్ చేయడం కోసం వాడుకోవడం సమంజసం కాదని చంద్రకుమార్ బోస్ విమర్శిస్తున్నారు. జాతీయ నాయకుల విషయంలో సినిమాటిక్ లిబర్టీ పేరుతో వాస్తవాలను వక్రీకరించడం, కల్పిత అంశాలను జోడించడం ఒక నేరమని ఆయన వ్యాఖ్యానించారు. ఫౌజీలో నేతాజీ, హిట్లర్ మధ్య జరిగిన మీటింగ్ ను తప్పుగా చిత్రీకరించారని, దీనివల్ల ఒక కల్పిత పాత్ర ముందు నేతాజీ స్థాయిని తగ్గించినట్లవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు చరిత్రలోకి వెళితే..నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ నియంత హిట్లర్‌ను కలవడం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం. ఆ సమయంలో బలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టాలంటే, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా.. జర్మనీకి చెందిన హిట్లర్, జపాన్ నాయకుడు హిడేకి టోజో ద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సైనిక సహాయం లభించవచ్చని నేతాజీ భావించారు. అయితే, హిట్లర్ సహాయం కోరినంత మాత్రాన నేతాజీ ఫాసిజాన్ని సమర్థించినట్లు కాదని చంద్రకుమార్ బోస్ స్పష్టం చేశారు. నేతాజీ ప్రజాస్వామ్య విలువలను బలంగా విశ్వసించేవారని, హిట్లర్‌తో సమావేశమైనప్పుడు కూడా ఆయన సమాన స్థాయిలో, ఎంతో హుందాగా వ్యవహరించారని తెలిపారు. తన స్వతంత్ర వైఖరిని ఏమాత్రం వదులుకోకుండా దేశం కోసం ఆయన చేసిన ప్రయత్నాలను సరైన చారిత్రక నేపథ్యంతోనే చూపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం కమర్షియల్ హంగుల కోసం నేతాజీని తక్కువ చేసి చూపించేలా సన్నివేశాలను రూపొందించడం తగదని ఆయన సూచించారు.
ప్రేక్షకుల్లో కేవలం ఆసక్తి పెంచడం కోసం జాతీయ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదని చంద్రకుమార్ బోస్ హితవు పలికారు. నేతాజీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించినందుకు దర్శకుడు హను రాఘవపూడి దేశ ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 19న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. టీజర్‌తో విపరీతమైన క్యూరియాసిటీ రేకెత్తించిన ఫౌజీ.. ఇప్పుడు నేతాజీ పాత్ర చిత్రీకరణపై చెలరేగిన వివాదంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.



